ఎస్ బీఐ ఛైర్ పర్సన్ కు ఎంత కోపం వచ్చిందో..?

ఎస్ బీఐ ఛైర్ పర్సన్ కు ఎంత కోపం వచ్చిందో..?

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..? అందులోకి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి మొండోడితో డీల్ అంటే అంత చిన్న విషయం కాదు కదా. సామాన్యుడికి లక్ష రూపాయిలు అప్పు ఇవ్వటానికి చుక్కలు చూపించే బ్యాంకు అధికారులు.. విజయ్ మాల్యాకు మాత్రం అప్పనంగా రూ.9వేల కోట్లు ఇచ్చేయటం.. అయ్యగారు వాటిని తిరిగి ఇచ్చే విషయంలో బ్యాంకర్లకు సినిమా చూపిస్తూనే..  గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లిపోవటం తెలిసిందే.

దేశం విడిచి వెళ్లిన తర్వాత తాను బ్యాంకులకు కట్టాల్సిన రూ.9వేల కోట్లకు రూ.6వేల కోట్ల మేర అయితే చెల్లిస్తానంటూ మాల్యా బేరం పెట్టటం తెలిసిందే. మాల్యా ఇష్యూలో అతనికి అప్పులిచ్చిన బ్యాంకులు అడ్డంగా బుక్ కావటమే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శల్ని మూటగట్టుకున్నాయి. మాల్యాకు అప్పులు ఇచ్చిన 17 బ్యాంకులు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డారు. ఈ కన్సార్టియంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య లీడ్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఒక సదస్సులో పాల్గొనటానికి జర్మనీకి వెళ్లారు. అక్కడకు వెళ్లినా.. మీడియా ఆమెను వదలకుండా మాల్యా ఇష్యూ మీద ప్రశ్నలు వేశాయి.

మాల్యాకు అప్పులు ఇచ్చిన బ్యాంకుల మీద వెల్లువెత్తుతున్న విమర్శలు కావొచ్చు.. ఇచ్చిన అప్పును తిరిగి ఇచ్చే విషయంలో విజయ్ మాల్యా అనుసరిస్తున్న వైఖరి మీద ఉన్న విసుకు కావొచ్చు కానీ.. అరుంధతీ భట్టాచార్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. డబ్బులు కడతానని కబుర్లు చెప్పటం తప్పించి.. తాను కడతానని చెప్పే మొత్తానికి సంబంధించిన వివరాల్ని మాత్రం చూపించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబుర్లు చెప్పటం మానేసి.. ముందు డబ్బు కట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇంత కటువుగా అప్పులు ఇచ్చే సమయంలోనే వ్యవహరిస్తే.. ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి కాదుగా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు