అమరావతికి వెళ్లే కన్నా జాబ్ మానేస్తున్నారట

అమరావతికి వెళ్లే కన్నా జాబ్ మానేస్తున్నారట

రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ ఏపీ సచివాలయంలో పని చేసే ఉద్యోగులు అమరావతికి వెళ్లాల్సి ఉంది. మొదట్లో అనుకున్నట్లు కాకుండా ఏపీ ప్రభుత్వ వైఖరితో జూన్ రెండో వారానికి తప్పనిసరిగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అమరావతికి వెళ్లే కన్నా.. ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇవ్వాలన్న ఆలోచనలో పలువురు ఏపీ సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు అమరావతి వెళ్లటం కష్టంగా భావిస్తున్నారు.

హైదరాబాద్ లో ఆస్తులతో పాటు.. కుటుంబ సభ్యుల కమిట్ మెంట్స్.. వారి ఉద్యోగాలు.. చదువు ఇలాంటి ఎన్నో కారణాల వారిని అమరావతికి వెళ్లనీయకుండా చేస్తున్నాయి. తప్పదన్న వారు అమరావతికి వెళ్లేందుకు మానసికంగా సిద్ధమవుతుంటే.. రిటైర్మెంట్ కు దగ్గరైన వారు.. బాగా సెటిల్ అయిన వారు మాత్రం అమరావతికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.

ఏపీ రాజధానికి వెళ్లి ఉద్యోగం చేసే కన్నా.. వీఆర్ఎస్ తీసేసుకొని.. ఇంకేదైనా పని చూసుకుంటే మంచిదన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వాదనకు తగినట్లే కొందరు ఏపీ సచివాలయ ఉద్యోగులు తమ వీఆర్ఎస్ అప్లికేషన్లు ప్రభుత్వానికి పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ పది మంది వరకూ ఇలా వీఆర్ఎస్ కు అప్లై చేసుకున్నారని.. రానున్న మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే ఏపీ సచివాలయ ఉద్యోగులకు అదనంగా 30 శాతం హెచ్ఆర్ ఏ తోపాటు వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలన్న సౌలభ్యాన్ని కూడా ఏపీ సర్కారు కల్పించింది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగుల ఇబ్బందుల పట్ల సానుకూలంగా స్పందించేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా ఉన్నప్పటికీ.. కొందరు ఉద్యోగులు మాత్రం వీఆర్ఎస్ వైపే మొగ్గు చూపటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు