రేవంత్కు ఇంకో షాక్ ఇవ్వనున్న కేసీఆర్

రేవంత్కు ఇంకో షాక్ ఇవ్వనున్న కేసీఆర్

టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారింది. రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు తప్పకుండా కృషిచేస్తాం- ఇది తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీ సందర్భంగా ఖమ్మంలో గులాబీ దళపతి కేసీఆర్ స్పష్టంగా చేసిన ప్రకటన. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ అంతే ధైర్యంగా రాజకీయ పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ఇప్పటికే చావుదెబ్బ తీసిని తెలుగుదేశం పార్టీకి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు కేసీఆర్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కారు ఎక్కించుకోనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో పాక్షికంగా మిగిలిన ముగ్గురు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేల్లో రేవంత్రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా, మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగానే కొనసాగాలని భావిస్తున్నట్టు మధ్యవర్తుల చర్చల్లో వెల్లడించినట్టు సమాచారం. ఇక మిగిలింది ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే. తెరాసలో చేరడానికి ఆయన సుముఖంగా ఉన్నప్పటికీ, ఓటుకు నోటు కేసులో ఉండటంవల్ల కొంతకాలం ఆగిన తర్వాత పార్టీలో చేరాల్సిందిగా సూచించడంతో ఆగిపోయినట్టు తెరాస వర్గాల సమాచారం. అయితే పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తెదేపా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, ఆ పార్టీని బలహీనపర్చే వ్యూహంలో భాగంగా త్వరలోనే సండ్రవెంకట వీరయ్యను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ఇదిలాఉండగా..తెరాసలో చేరడానికి సిద్ధంగావున్న ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకోకుండా మధ్యమధ్యలో కొంత వ్యవధి ఉండేలా పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల చెబుతున్నాయి. ఒకేసారి అందరినీ పార్టీలో చేర్చుకోవడం కంటే మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఇతర ప్రజా ప్రతినిధులపై మైండ్ గేమ్ ఆడొచ్చని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు