టీఆర్ఎస్ టార్గెట్ 26... క్రేజీ లాజిక్!

టీఆర్ఎస్ టార్గెట్ 26... క్రేజీ లాజిక్!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో 26వ సంఖ్య ఇపుడు గులాబీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ప్రతిపక్షాలు టార్గెట్‌గా సాగుతున్న జంపింగ్‌ల పర్వంలో తొలిదశలో తెలుగుదేశం అకౌంట్‌ను ఫినిష్ చేసిన టీఆర్ఎస్ అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై సేమ్ ఆపరేషన్ ప్రయోగించింది. త్వరలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైసీపీలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ఆపరేషన్లు సక్సెస్ చేసిన టీఆర్ఎస్ తాజాగా కాంగ్రెస్‌పై దృష్టి సారించింది.

ఈనెల 26న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలోగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెదేపా నుంచి ఒక్కరు తెరాసలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్టు పార్టీ వర్గాల సమాచారం. తెరాస సొంతంగా గెలుచుకున్న 63 స్థానాలకుతోడు తెదేపా, కాంగ్రెస్ నుంచి చేరికలతో రాష్ట్రంనుంచి ఖాళీకానున్న రెండు రాజ్యసభ స్థానాలూ తెరాస గెలుచుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను పక్కనపెట్టి రెండో ప్రతిపక్షం తెదేపాను మొదట తెరాస టార్గెట్ చేసింది. ఆ పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యేల్లో ముగ్గురు మినహా మిగతా వారంతా తెరాసలో ఇప్పటికే చేరిపోయారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్‌ని టార్గెట్ చేసి ఆ పార్టీకి మిగిలిన ఒక ఎంపీ, ఎమ్మెల్యేను సైతం పార్టీలో చేర్చేందుకు పన్నిన వ్యూహం విజయవంతమైంది. దీంతో ఇక కాంగ్రెస్‌పై తెరాస దృష్టి సారించింది.

రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరుగబోయే ఎన్నికలలోగా ఆపరేషన్ కాంగ్రెస్ దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెరాస వర్గాల సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల తెరాస తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా...కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరడానికి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు నల్లగొండ జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారని తెరాస వర్గాల విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రక్రియను ఈనెల 26లోగా పూర్తిచేసి రాజ్యసభకు తమ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలను పంపించే దిశగా కీలక స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇపుడు ఈనెల 26వ తేదీ టీఆర్ఎస్లో క్రేజీ అంకెగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English