ఎంపీ... ఎంపీ కొడుకుల ఫైట్

ఎంపీ... ఎంపీ కొడుకుల ఫైట్

రాష్ర్ట విభజన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, పార్టీల మధ్య మాత్రమే ఒకే పార్టీలోని నేతల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ టీడీపీ ఎంపీ, మరో టీడీపీ ఎంపీ కుమారుడి మధ్య యుద్ధం తీవ్రమైంది. హైకోర్టులో కేసుల వరకు వెళ్లింది. ఏపీ ఒలింపిక్ సంఘంపై పట్టుకోసం జరుగుతున్న ఈ యుద్ధంలో గెలుపెవరిదో తెలియదు కానీ ఇద్దరు ముఖ్యమైన ఎంపీలకు ఎలా సర్ది చెప్పాలో తెలియక చివరకు చంద్రబాబు కూడా తలపట్టుకుంటున్నారు. కోర్టుల వరకు వెళ్లడంతో పార్టీ పరువు పోతుందని.. తాను ఎంటరై పరిస్థితి చక్కదిద్దడమే మార్గమని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏపీ ఒలింపిక్ సంఘంపై ఇంతకుముందు కూడా గొడవ జరిగింది. గతంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ల మధ్య దీనిపై చాలాకాలం పోరు నడిచింది.  వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించిన ఇరు వర్గాలు ఎవరికి వారు  తమ సంఘమే నిజమైనదని ప్రకటించుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీ పరువు తీశారు. ఇప్పుడు కూడా ఒలింపిక్ సంఘం వ్యవహారంలో మరోసారి టీడీపీ పరువు పోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే... ఈసారి వర్గాల్లో కొన్ని మార్పులు వచ్చాయి.  అప్పట్లో చంద్రబాబు క్లాస్ పీకడంతో ఒలింపిక్ సంఘం గొడవల నుంచి సీఎం రమేశ్ సైడపోయారు. తాజాగా  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి ఎంటరై జయదేవ్ గల్లా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో  తమదే నిజమైన ఒలింపిక్ సంఘమని ప్రకటించారు.

గల్లా జయదేవ్ నేతృత్వంలోని సంఘాన్నే అధికారిక సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్  జారీ చేసిన ఉత్తర్వులను పవన్ రెడ్డి సవాల్ చేశారు. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని పవన్ రెడ్డి నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి హోదాలో పవన్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో గల్లా జయదేవ్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ తో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని గల్లా జయదేవ్... ఏపీ ఒలింపిక్ సంఘాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఆధ్వర్యంలోని సంఘమే అసలైనదని కూడా పవన్ రెడ్డి వాదించారు.  గల్లా జయదేవ్ కుట్ర పన్ని తమ సంఘం పేరుతోనే మరో సంఘం ఏర్పాటు చేశారని పవన్ రెడ్డి ఆరోపించారు. రామచంద్రన్ కుమారుడు గల్లా జయదేవ్ కంపెనీల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారని, ఈ కారణంగానే జయదేవ్ కు రామచంద్రన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దీంతో ఒలింపిక్ సంఘం పోరు టీడీపీలో మళ్లీ పెద్ద చిచ్చు పెట్టేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు