మే 4 ఏపీకి ఎందుకు ఎందుకు ముఖ్యమైంది?

మే 4 ఏపీకి ఎందుకు ఎందుకు ముఖ్యమైంది?

ఓ రెండు నెలల క్రితం జరిగిన హడావుడి మనందరికీ గుర్తుండే ఉంటుంది. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన సొమ్ములు, రావాల్సిన సంస్థలు, చేసిన కేటాయింపుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉండే నీతి అయోగ్ సమీక్షిస్తుందనేది ఈ వార్త సారంశం. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ ఈ ప్రక్రియను ప్రారంభించిందని ఏపీకి పెద్ద ఎత్తున నిధులు దక్కుతాయనేది విషయం. అయితే రెండు నెలలు గడిచిపోయాయి కానీ ఫలితం శూన్యం.

ఇదిలాఉంటే తాజాగా రాజ్యసభలో కేంద్ర మంత్రి హరీభాయ్ చౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని తేల్చేశారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ ఆ అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఢిల్లీలో జరగనున్న నీతి అయోగ్ సమావేశం కీలకంగా మారనుంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడాన్ని బీజేపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కోరింది, రాష్ర్టానికి ఇంతవరకు కేటాయించిన నిధులు, రాష్ట్రం ఎదిగేందుకు కావాల్సిన సహాయం తదితర అంశాలపై ఈ సమావేశంలో నీతి అయోగ్ ఉన్నతాధికారులు చర్చించనున్నారని సమాచారం. ఈ సమావేశం చాలా కీలకమైందిగా చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం తగు ఆధారాలు సిద్ధం చేస్తున్నదని సమాచారం.

ఇదిలాఉండగా....వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేసిన తీరుకు కేంద్ర మంత్రులు ఉత్సాహంతో స్పందించడం, ఇంటర్వ్యూలు అడిగిన వెంటనే ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు బీజేపీ అగ్రనాయకుల వద్ద అటు నిధులు, ఇటు జగన్ రాజకీయాల గురించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా మే 4 తేదీ ఏపీ రాజకీయాల పరంగా కీలకంగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు