చంద్రబాబుకు ముందుగా మద్దతిచ్చేది వీరే

చంద్రబాబుకు ముందుగా మద్దతిచ్చేది వీరే

జూన్ ఒకటో తేదీ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ కేంద్రంగా పరిపాలన సాగించాలనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి తగినట్లుగా అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నాటికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి తరలించనున్న మొదటి విడత ప్రభుత్వ శాఖల గుర్తింపు దాదాపు ఖరారైంది. అమరావతి రాజధాని ప్రాంతంలో వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు వేగవంతమవుతున్న విషయం విదితమే. మొదటి దశలో ఇక్కడి నుంచి ప్రభుత్వ శాఖల తరలింపు బాధ్యతను ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి లింగరాజు పాణిగ్రాహికి అప్పగించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల తరలింపుకు రెండు సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖలు, ప్రజలతో పరోక్షంగా సంబంధాలు ఉండే శాఖలను ప్రాతిపదికగా తీసుకున్నారని సమాచారం. మొదటి దశలో హోం, సంక్షేమం, వైద్య-ఆరోగ్యం, విద్య, హౌసింగ్, వ్యవసాయం, జలవనరుల శాఖ, పంచాయితీ రాజ్ శాఖలు హైదరాబాద్ నుంచి అమరావతికి తరలనున్నాయి. ఈ శాఖల్లో పనిచేసే సిబ్బంది, కొత్త సచివాలయంలో వీరికి పనిచేసేందుకు అవసరమైన స్ధలాన్ని గుర్తించారు. అలాగే ఆయా శాఖలకు బ్లాక్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది. సమాచార టెక్నాలజీ శాఖను ఇప్పటికే తరలించిన విషయం విదితమే. మొత్తం సచివాలయాన్ని 1,2,3 బ్లాక్లలో సర్దుతారని సమాచారం. 4,5 బ్లాక్లలో వివిధ శాఖల డైరెక్టరేట్లకు కేటాయించనున్నారు. డైరెక్టరేట్లను జూలై నెలాఖరుకు తరలించే అవకాశాలున్నాయి. కాగా ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, పరిశ్రమలు, విద్యుత్ శాఖలను దశలవారీగా తరలిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్ధల ఆస్తుల విభజన, ఉద్యోగుల పంపకాల పని ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ శాఖలతో ముడిపడిన ఇతర శాఖలు ఇప్పట్లో తరలించే అవకాశాలు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు