బాబు క్లారిటీః కేసీఆర్ తీరుపై కేంద్రానికి చెప్తాం

బాబు క్లారిటీః కేసీఆర్ తీరుపై కేంద్రానికి చెప్తాం

సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం వివరాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా మీడియాకు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే తమ విధానమని చెప్పారు. అయితే విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.200 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 850 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. పశుగ్రాసానికి రూ.32 కోట్లు మంజూరుచేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. కరవు నివారించేందుకు నీరు- చెట్టు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు 40 వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ చౌదరి చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ...ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అదే విధంగా విశాఖ రైల్వే జోన్ పెండింగ్లోనే ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ...విభజన చట్టంలోని పేర్కొన్నఅంశాలు పరిష్కరించాలని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రపెద్దలను కోరానని సీఎం చంద్రబాబు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు