బాబును తెగ మోసేసిన కాంగ్రెస్ ఎంపీ

బాబును తెగ మోసేసిన కాంగ్రెస్ ఎంపీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రి- తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడును తెగ మోసేశారు. ఏకంగా గ‌తం, వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్‌ను క‌ల‌గ‌లిపి ఆకాశానికి ఎత్తేశారు. అపోలో హెల్త్‌సిటీలో ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సంద‌ర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ తెగ కితాబిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అహర్నిశలు శ్రమించి నిర్మిస్తున్న అమరావతికి రాజకీయాలకతీతంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉన్న చంద్రబాబుకు అపోలో ఆసుపత్రి అవసరం లేదని చమత్కరించారు. హైదరాబాదు దేశంలోనే ప్రముఖ నగరంగా పేరు గాంచిందంటే అది చంద్రబాబు ఘనతేనని ప్ర‌శంసించారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, చంద్రబాబు నాయుడు వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ను తీర్చిదిద్దే నాయ‌కుడిగా చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు అందుకుంటున్నార‌ని కితాబిచ్చారు. పెట్టుబ‌డుల నుంచి మొద‌లుకొని కేంద్ర సాయం వ‌ర‌కు బాబు స‌త్తా వల్లేన‌ని చెప్పారు. ఒక కాంగ్రెస్‌ నాయకునిగా చంద్రబాబును పొగుడుతున్నానంటే ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

ఈ సంద‌ర్భంగా అపోలో అధినేత డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తాజా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానమంతా అపోలో ఆసుపత్రిలో ఉందని చెప్పారు. ప్రపంచస్థాయి వసతులన్నింటినీ ఏర్పాటు చేశామన్నారు. 250 పడకలతో, అత్యాధునిక వసతులతో అపోలో అన్ని చికిత్సలు అందిస్తోందని వివరించారు. అయితే కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా సుబ్బిరామిరెడ్డి పొగ‌డ్త‌లు అంద‌రిలో కొత్త ఆస‌క్తిని రేకెత్తించాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు