అంబలి కేంద్రాలకు కేసీఆర్ నో?

అంబలి కేంద్రాలకు కేసీఆర్ నో?

ఎండ వేడితో అల్లాడిపోతున్న సగటుజీవుల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న అంబలి కేంద్రాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నో చెప్పేశారు. ఇలాంటి కేంద్రాలకు అనుమతి ఇవ్వకూడదని తేల్చేశారు. వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాలతో పాటు.. కొందరు అంబలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినప్పుడు ఆయన అలాంటి కేంద్రాలకు నో చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఈ కేంద్రాలకు కేసీఆర్ సమాధానం కాస్త చిత్రంగా ఉండటం గమనార్హం.

అంబలి కేంద్రాలు వద్దని చెప్పటానికి కేసీఆర్ చెప్పిన కారణం చూస్తే.. అంబలి కేంద్రాల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంపై దుష్ర్పచారం జరిగే ప్రమాదం ఉందని.. తిండి లేక ప్రజలు అంబలి తాగుతున్నారన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు. అంబలి కేంద్రాల్ని ప్రోత్సహించొద్దని ఆయన మహబూబ్ నగర్ కలెక్టర్ శ్రీదేవికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సేవా భావంతో ఏర్పాటు చేసే అంబలి కేంద్రాలపైన దుష్ప్రచారం జరుగుతుందని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండ తీవ్రత కారణంగా నిత్యం పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు ఎందుకు పట్టటం లేదు.

దేశ వ్యాప్తంగా ఎండ తీవ్రత ఇంచుమించు ఒకేలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ బాధితులు భారీగా ఉండటంపై వచ్చే విమర్శల మాటేమిటి? ప్రభుత్వాలు సరిగా పని చేయని కారణంగా ఇంత భారీగా ప్రజలు వడదెబ్బకు మరణిస్తున్నారంటూ వస్తున్న విమర్శలు తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేయదా? అన్న ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు?

మరో కీలకమైన అంశం ఏమిటంటే.. వడదెబ్బ మరణాలపై మీడియాలో వచ్చే కథనాల్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ కేసీఆర్ చెప్పటం విశేషం. వడదెబ్బ కారణంగా భారీగా మరణాలు చోటుచేసుకుంటున్న వైనంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేలా ఉన్న వార్తల్ని పట్టించుకోవద్దంటూ కేసీఆర్ చెబుతున్న తీరు చూసినప్పుడు.. చాలా సందేహాలు కలగటం ఖాయం. మీడియాలో వచ్చే కథనాల్ని పరిగణలోకి తీసుకొవద్దని చెప్పే బదులు క్రాస్ చెక్ చేసి.. ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ లు ఇవ్వమని చెబితే బాగుండేది కదా?తనకు అనుకూల వాదనను వినిపించే సమయంలో మీడియా వార్తల్ని కోట్ చేసే కేసీఆర్.. వడదెబ్బ మరణ వార్తల్ని లెక్కలోకి తీసుకోవద్దని చెప్పటం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు