హరీశ్ ఏసుకున్నాడు! వెయ్యి మంది జగన్ లు వచ్చినా...

హరీశ్ ఏసుకున్నాడు!  వెయ్యి మంది జగన్ లు వచ్చినా...

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఈ పథకానికి నిరసనగా తాను మూడు రోజుల నిరసన దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెయ్యి మంది జగన్ లు.. వందమంది చంద్రబాబులు వచ్చినా ప్రాజెక్టు ఆగదని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మే 16 నుంచి 18 మధ్యలో నిరసన దీక్ష చేస్తానని ప్రకటించటంపై ఫైర్ అయ్యారు.

పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా దీక్ష చేయటం దుర్మార్గమన్న హరీశ్.. జగన్ తండ్రి వైఎస్ జలదోపిడీకి పాల్పడితే.. ఆయన బాటలోనే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్న జగన్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రజల ఉసురుపోసుకోవద్దని.. మానవత్వం ఉన్న వాళ్లు ఎవరూ ఈ ప్రాజెక్టును అడ్డుకోరని వ్యాఖ్యానించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పిన హరీశ్.. జగన్ తండ్రి వైఎస్ మాదిరి అక్రమ ప్రాజెక్టులు కట్టటం లేదని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని..ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. జగన్ దీక్షలు చేస్తామని చెబుతుంటే.. చంద్రబాబు కేంద్రానికి లేఖల మీద లేఖలు రాస్తున్నారని..కోర్టుల్లో రైతుల చేత కేసులు వేయిస్తున్నట్లుగా ఆరోపించారు. జగన్ ను దీక్ష విరమించుకోవాలంటూ తాను చేతులు జోడించి మరీ విన్నవిస్తున్నట్లుగా హరీశ్ వ్యాఖ్యానించారు.

ఇన్ని మాటలు చెప్పిన హరీశ్ ఎంతసేపటికి తన వాదనను మాత్రమే వినిపించారు తప్పించి.. ఈ ప్రాజెక్టు మీద వస్తున్న విమర్శలకు సమాధానాలు మాత్రం చెప్పకపోవటం మర్చిపోకూడదు. పాలమూరు ప్రాజెక్టు మీద వెల్లువెత్తుతున్న సందేహాల్ని తీర్చటం ద్వారా ప్రాజెక్టు మీద జనాభిప్రాయాన్ని కూడగట్టుకోవాల్సింది పోయి.. మాటలతో పైచేయి సాధించాలనుకోవటం ఏమిటో అర్థం కానిది. హరీశ్ మాటల్ని విన్నప్పుడు కలిగే సందేహాల్నే చూస్తే..

= జగన్ సందేహాం వ్యక్తం చేసినట్లుగా పాలమూరు కారణంగా ఖమ్మం.. నల్గొండ జిల్లాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందా లేదా?

= జగన్ చెప్పినట్లుగా.. పాలమూరు కారణంగా ఏపీలోని జిల్లాలు ప్రభావితం అవుతాయా? లేదా?

= రైతు ఎక్కడైనా రైతే.. అతని కడుపు కొట్టకూడదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు పాలమూరు ప్రాజెక్టుకు వర్తిస్తాయా? లేదా?

= ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉంటే.. కేంద్రానికి రాసే లేఖల గురించి బాధ పడాల్సింది ఏముంది?

= ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు.. ఏ ప్రాంతం వారికి నష్టం వాటిల్లకుండా ఉన్నప్పుడు.. హరీశ్ ఎందుకంత ఆగమాగం అవుతున్నట్లు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు