కేసీఆర్ క్లారిటీః టీఆర్ఎస్ను బలోపేతం చేస్తాం

కేసీఆర్ క్లారిటీః టీఆర్ఎస్ను బలోపేతం చేస్తాం

టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ ముగింపు సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్లీనరీలో తీర్మానాలన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించామని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్నామని ఇందులో భాగంగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని జోడు గుర్రాళ్లా నడిపించాలని చెప్పారు. బంగారు తెలంగాణ సాధ్యం కావాలనుకునే వాళ్లు పార్టీని పటిష్టం చేసేందుకు తోచినంత సాయం చేయాలన్నారు. మిషన్ భగీరథలో భాగంగా రైతుల పొలాల్లో నుంచి వేసే పైప్లైన్ పనులను వేసవిలోగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలన్నారు.

కేసీఆర్ కంటే ముందు మాట్లాడిన ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్.. గత పాలకుల హయాంలో ఐదో స్థానానికి పడిపోయిందని ఆరోపించారు. గత పాలకులు హైదరాబాద్ లో కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. హైదరాబాద్ పురోగతిలో తాము అందరినీ భాగస్వాములను చేస్తున్నామని చెప్పారు.

దేశమంతా స్వచ్ఛ భారత్ తూతూమంత్రంలా చేస్తే.. స్వచ్ఛ కార్యక్రమం అంటే ఎలా ఉండాలో హైదరాబాద్ లో చేసి చూపించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్కైవేల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. మూసీపై ఈస్ట్-వెస్ట్ కారిడార్ నిర్మిస్తున్నామని చెప్పారు. రూపాయి కూడా లంచం లేకుండా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహిళలు, వికలాంగ మహిళలు కూడా పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి సహకరిస్తున్నామని తెలిపారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా.. పారిశ్రామిక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించినమని అన్నారు. గూగుల్, అమెజాన్, ఉబర్ లాంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేశాయని కేటీఆర్ వివరించారు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు