ఎస్కేప్ ప్లాన్ మామూలుగా లేదు

ఎస్కేప్ ప్లాన్ మామూలుగా లేదు

యాకిన్ గుజ్ మాన్... ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు అత్యంత సంచలనం. మెక్సికోకు చెందిన ఈ డ్రగ్ మాఫియా డాన్ మామూలోడు కాడు. జైళ్లోనుంచి తప్పించుకోవడానికి ఏకంగా కిలోమీటర్ల దూరం సొరంగాన్ని తవ్వి... అందులోంచి మోటార్ సైకిల్ నడుపుకుంటూ వెళ్లి మరీ తప్పించుకుని పారిపోయాడు. ఈ సంగతి కొద్ది నెలల కిందట సంచలనం రేపింది. ఈ స్థాయిలో కాకపోయినా జైళ్ల నుంచి తప్పించుకోవడానికి.... డ్రగ్సు అక్రమరవాణాకు సొరంగాలు తవ్విన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే... ఇలా తప్పించుకోవడానికి సొరంగాలు తవ్వే చరిత్ర కేవలం మనుషులకే ఉంది. జంతువులు తాము తల దాచుకోవడానికి కలుగులు మాత్రమే తవ్వుతాయి. కానీ... హైదరాబాద్ జూ పార్కులో మాత్రం ఓ విచిత్రం జరిగింది. ఎలుగు బంటి ఒకటి జూలోని ఎన్ క్లోజర్ నుంచి బయటకు తప్పించుకోవడానికి గుజ్ మాన్ తరహాలో సొరంగం తవ్వింది. సొరంగం ద్వారా ఎన్ క్లోజర్ నుంచి బయటపడి హల్ చల్ చేసింది.

హైదరాబాద్ లోని  నెహ్రూ జూపార్క్ నుంచి ఓ ఎలుగుబంటి తప్పించుకుని జూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. తానుండాల్సిన బోను నుంచి బయటకు ఓ కలుగు తవ్వి మరీ తప్పించుకున్న ఈ ఎలుగు జూ ప్రహరీగోడ ఎక్కేసి హల్ చల్ చేసింది. ఎత్తయిన గోడను దూకడానికి భయపడిందో ఏమో గోడపైనే అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. ఎలుగుబంటిని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వారు హుటాహుటిన వచ్చి, దాన్ని పట్టుకునేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు. చివరికి ట్రాంక్విలైజర్ల ద్వారా మత్తు మందిచ్చి, దాన్ని అదుపులోకి తీసుకున్నారు. తమకు తెలిసినంతవరకు ప్రపంచంలోనే ఇంతవరకు ఏ  క్రూర జంతువు కూడా తప్పించుకోవడానికి ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేయలేదని జూ అధికారులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు