ఆయన వెనుక పవన్.. జగన్ ఇద్దరూ లేరంట

ఆయన వెనుక పవన్.. జగన్ ఇద్దరూ లేరంట

కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న సింగిల్ ఎజెండాతో చంద్రబాబు సర్కారుకు వణుకు పుట్టించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం. కాలం గడిచినా తనలో పోరాట పటిమ ఏ మాత్రం తగ్గలేదన్న విషయాన్ని ఆ మధ్యన ఆయన నిర్వహించిన ఆందోళనలతో చెప్పకనే చెప్పేశారు. ముద్రగడ పిలుపే ప్రభంజనంగా చిందులేసిన కాపులతో ఏపీ సర్కారు హైబీపీ వచ్చినంత పనైంది.

యుద్ధప్రాతిపదికన ముద్రగడను బుజ్జగించేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన పాట్లు అన్నిఇన్ని కావన్న సంగతి తెలిసిందే. ఇక.. ముద్రగడ విషయానికి వస్తే.. ఒకసారి చంద్రబాబును పొగిడేసే ఆయన.. మళ్లీ అదే నోటితో బాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తుంటారు. ముద్రగడ నోటి నుంచి ఎప్పుడు తిట్లు వస్తాయో.. ఎప్పుడు ప్రశంసలు వస్తాయో అర్థం కాని పరిస్థితి.

తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన.. బాబు మీద మరోసారి ఫైర్ అయ్యారు. కాపులకు న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఉండి ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే కాపులకు న్యాయం చేసేవారన్నారు. కాపు ఉద్యమానికి సహకరించాలని తాను పవన్ కల్యాణ్ ను అడగలేదని వెల్లడించారు. తన వెనుక ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కానీ.. పవన్ కానీ లేరన్నారు. తుని రైలు దహనం కేసులో కాపుల్ని పోలీసులు వేధిస్తున్నారంటూ మండిపడిన ముద్రగడ.. జూన్ లో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు