ఒక్కరోజులో 79 ప్రాణాలు తీశాయి

ఒక్కరోజులో 79 ప్రాణాలు తీశాయి

తెలుగు ప్రాంతం మైక్రోఓవెన్ లా మారిపోయింది. కాస్తంత ఫ్యాన్ వేసుకొని ఇంట్లో కూర్చోవాలనుకున్న కూర్చోలేని పరిస్థితి. అలా అని బయటకు అడుగు పెట్టాలంటే బెదిరిపోయే పరిస్థితి. కారిపోయే చెమట.. జిగటగా మారిన ఒంటితో చిరాకు ఒక ఎత్తు. మరోవైపు.. ఎండిపోయే గొంతు.. తడారిపోయే పెదాలు.. ఎంత తాగినా తీరని దాహం.. వళ్లు వేడిగా ఉంటూ చల్లదనం కోసం శరీరం తపిస్తున్న పరిస్థితి తెలుగుప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఫీలవుతున్నారు.

భానుడి దెబ్బకు పాత రికార్డులన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే మండుతున్న ఎండలతో జనాలు ఠారెత్తే పరిస్థితి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ రోడ్ల మీదకు రాకుండా ఉండటమే మంచిదంటూ వాతావరణ నిపుణులు.. వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మరీ.. అవసరమైతే తప్ప బయటకు రావటం తగ్గించాలని చెబుతున్నారు.

ఠారెత్తించే ఎండ తీవ్రత మరో మూడు రోజుల పాటు సాగుతుందని చెబుతున్న వాతావరణ అధికారుల మాట ప్రజల గుండెల్లో పెద్ద రాయి పడేలా చేస్తోంది. ఎందుకంటే.. ఏప్రిల్ లోనే ఈ రేంజ్ లో ఎండలు మండితే.. మరి మంటపుట్టించే ‘‘మే’’ను తలుచుకుంటేనే వణుకు పుట్టే పరిస్థితి. తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా.. ఏప్రిల్ రెండో వారంలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతనమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. కనిష్ఠంగా 42 అయితే.. గరిష్ఠంగా 45 డిగ్రీలుగా చెబుతున్నారు.

నిజానికి రేంజ్ లో ఎండలు రాయలసీమ.. కోస్తాలలో మామూలే. కానీ.. తెలంగాణలో ఈ స్థాయిలో ఎండలు.. అది కూడా ఏప్రిల్ మొదట్లోనే కావటం దడ పుట్టిస్తోంది. పాడు ఎండల కారణంగా.. శనివారం ఒక్క రోజులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరణించిన వారి సంఖ్య అక్షరాల 79 మంది. అది కూడా అధికారిక లెక్కల ప్రకారం. అనధికారిక లెక్కల ప్రకారం ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. సూరీడు చెలరేగిపోతున్న ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎండ వేళలో పనులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. బీకేర్ ఫుల్..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు