బిచ్చమెత్తుకొని బతుకుతానంటున్న ఫైర్ బ్రాండ్

బిచ్చమెత్తుకొని బతుకుతానంటున్న ఫైర్ బ్రాండ్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూస్తే ఒకప్పటి టీమిండియా జట్టును తలపిస్తుంది. పేపరు మీద తెలంగాణ కాంగ్రెస్ నేతల పేర్లు రాసుకుంటూ పోతే.. తల పండిన రాజకీయ నేతలు కనిపిస్తారు. బలమైన క్యాడర్ తో పాటు.. తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో మాంచి పట్టున్నట్లు కనిపిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయినట్లు వ్యవహరించే వారంతా ప్రస్తుతం కామ్ గా కూర్చోవటం కనిపిస్తుంది.

పవర్ ఉన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారపక్ష వైఖరి మీద పోరాటం చేసేందుకు కొద్దిమంది మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తెర మీద కనిపించకుండా పోవటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మాజీ మంత్రి.. పాలమూరు జిల్లా ఫైర్ బ్రాండ్ గా సుపరిచితురాలైన డీకే అరుణ మాత్రం వారికి భిన్నం. తెలంగాణ అధికారపక్షంపై ఆమె అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారీ ఘాటైన విమర్శలు సంధిస్తూ.. ఆరోపణలు చేస్తూ పోరాటం చేస్తున్నారు.

తాను ఏ మాత్రం కామ్ గా ఉన్నా.. జిల్లాలో తన అధిక్యతకు గండిపడుతుందన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తెంగాణ అధికారపక్షంపై తాను చేస్తున్న పోరాటానికి ఫలితంగా తమ ఆమె కుటుంబం ఆర్థికంగా చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె వాపోతున్నారు. డీకే అరుణను దెబ్బ తీసేందుకు ఆమె సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని  టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించటం.. ఆయన వెళ్లిపోవటం తెలిసిందే. తాజా పరిణామంపై ఆమె నిప్పులు చెరుగుతున్నారు.

టీఆర్ఎస్ పై అవిశ్రాంతంగా పోరాటం చేస్తానని.. అవసరమైతే బిచ్చం ఎత్తుకొని బతుకుతాను కానీ.. టీఆర్ఎస్ లో మాత్రం చేరేది లేదని తేల్చి చెబుతున్నారు. మొనగాళ్లమని చెప్పుకునే మగమహారాజులు కేసీఆర్ ధాటికి బిక్కచచ్చిపోతున్న వేళ.. అరుణమ్మ మాత్రం అందుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడుతున్న తీరు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. సైద్ధాంతిక విభేదాల్ని పక్కన పెట్టేసి అధికారాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్న ఈ రోజుల్లో అందుకు భిన్నంగా.. బిచ్చం ఎత్తుకొని బతకటానికైనా తాను సిద్ధమే కానీ.. పార్టీ మారేది లేదన్న అరుణమ్మ మాటలు వింటే ఇలాంటి మాటలు ఆమెకు మాత్రమే సాధ్యమన్న భావన కలగటం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు