పవన్ మాట కామ్రేడ్కి అలా అర్థమైందా?

పవన్ మాట కామ్రేడ్కి అలా అర్థమైందా?

ఏం మాట్లాడాలో తెలీనప్పుడు ఏదో ఒకటి మాట్లాడే పనిని కొందరు నేతలు చేస్తుంటారు. వారు మాట్లాడే మాటలకు మీడియా ఇచ్చే ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో తమ మాటను మీడియాలో వచ్చే మార్గాలు చూసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా హాట్ టాపిక్ జరిగిపోతే చాలు.. ఈ తరహా నేతలు చెలరేగిపోతుంటారు. అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడేయటం.. తాము మాట్లాడుతున్న మాటల్లో విషయం ఏమైనా ఉందా? లేదా? అన్న చూసుకోకుండా మాట్లాడేయటం ఇలాంటి వారి ప్రత్యేకత. తాజాగా ఇలానే మాట్లాడుతున్నారు ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

తాజాగా హాట్ టాపిక్ గా మారిన పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన రామకృష్ణ ఒక అద్భుతమైన విషయాన్ని బయట పెట్టారు. పవన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎందుకు ఉండాలనుకుంటున్న విషయాన్ని తానేదో కనిపెట్టినట్లుగా రామకృష్ణ చెప్పుకొచ్చారు. చేతిలో సినిమాలు లేకపోవటంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానంటూ ప్రకటనలు చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మోడీతో మాట్లాడే దమ్ము పవన్కు ఉందా? అని ప్రశ్నిస్తూ రామకృష్ణ.. తమ పార్టీ జాతీయ నేతలు ఎప్పుడూ ఏపీ ప్రత్యేకహోదా గురించి ఎందుకు పెదవి విప్పరన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవటం గమనార్హం.

అయినా..పవన్ కల్యాణ్ రేపటి నుంచే రాజకీయాల్లోకి దూకుతానని చెప్పలేదు కదా. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారే కానీ.. ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తానన్న మాటను మాట వరుసకు కూడా చెప్పలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. ఇలాంటివేమీ పట్టించుకోని రామకృష్ణ.. సినిమాలు చేతిలో లేని కారణంగా పవన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పటం విశేషం. చూస్తుంటే పవన్ పేరు చెప్పుకొని మీడియాలో తళుక్కున మెరవాలని తపన రామకృష్ణ అండ్ కో లాంటి నేతల్లో కనిపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా.. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ చెప్పిన మాటలు కామ్రేడ్లకు అలా అర్థం కావటం ఏమిటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు