మద్యనిషేధంతో దేవుళ్లకూ కష్టాలొచ్చాయట..

మద్యనిషేధంతో  దేవుళ్లకూ కష్టాలొచ్చాయట..

బీహార్లో విధించిన మద్య నిషేధం దెబ్బకు అక్కడ వందలాది మందికి పిచ్చెక్కి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. మనుషులకే కాదు దేవుళ్లపైనా ఈ మద్య నిషేధ ప్రభావం పడిందట. పొద్దున గుడి తలుపులు తెరిచాక మంచిగా క్వార్టర్ సీసా నైవేద్యంగా స్వీకరించే అక్కడి కొందరు దేవుళ్లకు ఇప్పుడు నిషేధం దెబ్బకు నైవేద్యం కూడా లేదట. ధూపదీపాలున్నా పాపం.. నైవేద్యం ‘చుక్క’ మాత్రం కరవైందట. దీంతో దేవుళ్ల తరఫున ప్రజలు, పూజారులు అంతా అధికారుల చుట్టూ తిరుగుతున్నారట.. మాకు మందు లేకపోయినా ఫరవాలేదు, మా దేవుళ్లకు కాస్త దొరికేలా చూడండి సార్ అంటూ పోలీసులను, అధికారులను ప్రాథేయపడుతున్నారట.

బీహార్‌ ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్య నిషేధంతో మందు బాబులే కాదు మందు దేవుళ్లు కూడా విలవిల్లాడిపోతున్నారు. ఆ రాష్ట్రంలో మనుషులతో పాటు దేవుళ్లకూ మందు కావాలి. పండగైనా, పబ్బమైనా, శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఏదైనా సరే ఇంటిల్లి పాదీ మద్యం సీసాలతో దేవుళ్లను పూజిస్తారు. ఆలయాల్లోకి మందు తీసుకు వెళ్లి స్వయంగా విగ్రహాలకు తాగించినట్లు చేస్తారు. ముఖ్యంగా దళిత, మహాదళిత వర్గాలకు చెందిన ప్రజలు పూజించే డాక్‌ బాబా, మసాన్‌ బాబా, గోరాయా బాబా, దిహ్వాల్‌ బాబా, నౌకా బాబా, భైరవ్‌ వంటి దేవుళ్లకు కల్లు, విస్కీ, సారా వీటితో పాటు చికెన్‌ ముక్కలుండాల్సిందే. గుళ్లకు వెళ్లే ప్రతి భక్తుడూ ఇంటి వద్ద నుంచి మద్యం సీసాలను తీసుకు వెళ్లి అత్యంత భక్తి ప్రపత్తులతో నైవేద్యంగా సమర్పిస్తారు. పండుగలు, పుట్టినరోజులు,పెళ్లి, చావు, పెళ్లిరోజులు సందర్భం ఏదైనా సరే దేవుళ్లను మాత్రం మద్యం మత్తులో ముంచాల్సిం దే. మద్యం, చికెన్‌ పెట్టక పోతే దేవుడికి కోపం వస్తుందని, అవి రెండూ ఎంత ఎక్కువగా సమర్పిస్తే అంత తొందరగా తమ కోరికలు నెరవేరతాయని వారి విశ్వాసం. అయితే ఇప్పుడు ప్రభుత్వం విధిం చిన మద్య పాన నిషేధంతో వారికీ చిక్కొచ్చి పడింది. దేవుళ్లకు నైవేద్యం పెట్టక పోతే ఆకలితో పస్తుంటారని భావించిన భక్తులు దొంగ చాటుగా మద్యాన్ని గుళ్లకు తీసుకు వెళ్లినా పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు వారిని పట్టుకుంటున్నారు. దాంతో మద్యం దొరక్క దేవుళ్లకు దాహంతో గొంతెండి పోతోందంటే నమ్మండి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం తయారీ, అమ్మకం, తాగడంపై సంపూర్ణ నిషేధం విధించడంతో వారికీ తిప్పలు వచ్చి పడ్డాయి. మా దేవుడు కపాల్‌ భైరవ్‌ కేవలం మద్యమే నైవేద్యంగా తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించడంతో 40 శాతం భక్తులు గుడికి రావడం మానేసారని గోదావరి మొహల్లా భైరవ్‌స్తాన్‌ ఆలయం పూజారి అనంత్‌ మరాటే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి డాక్‌ బాబా, సంస్తాన్‌ బాబా ఆలయాల్లో కూడా నెలకొందని తెలిపారు. నవాడా జిల్లాలోని కౌకాల్‌, పాట్నా జిల్లాలోని గోరాయ స్తాన్‌లోనూ అదే పరిస్థితి ఉంది. దయచేసి దేవుళ్లకు మద్యా న్ని అనుమతించాలని కోరుతున్నారు.

మా కుటుంబం కలశంలో మందు పోసి ప్రాణదేవతకు ఇంట్లో సమర్పిస్తామని గోరాయస్తాన్‌కు చెందిన బాబ్లూ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జితిన్‌ రామ్‌ మాంజీ  సామాజిక వర్గానికి చెందిన ముషాహర్‌ కమ్యూనిటీ ప్రజలు మసాన్‌ బాబాను మద్యంతో పూజిస్తారు. అన్ని పండుగలకు మద్యాన్నే నైవేద్యంగా సమర్పిస్తారు. పుట్టినరోజులు, మరణాలు, వివాహ వార్షికోత్సవాలు సందర్భం ఏదైనా సరే మద్యాన్ని దేవుళ్లకు తాగించాల్సిందే. దేవుళ్లకు మద్యం పెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులు తర్వాత పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయితే... దేవుళ్ల విషయంలో గవర్నమెంటు మినహాయింపు ఇస్తుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు