లోకేశ్ భజనే ఏపీలో లేటెస్ట్ ట్రెండ్

లోకేశ్ భజనే ఏపీలో లేటెస్ట్ ట్రెండ్

తమ భక్తిని చాటుకునే అవకాశం కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఏపీ అధికారపక్ష నేతలకు దొరక్క దొరక్క ఒక్క అవకాశం దొరికింది. ఎప్పటి నుంచో ఎంతో ఆశగా ఎదురుచూసిన అవకాశం లభిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అందుకే.. తాజాగా ఏపీ తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకూ పార్టీలో కీలకభూమిక పోషిస్తున్న చినబాబు.. ఏపీ సర్కారులోకి అధికారికంగా అడుగు పెట్టనున్న నేపథ్యంలో.. ఆయనపట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు విపరీతంగా పోటీ పడుతున్న దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

పార్టీ పదవిలో ఉన్నప్పుడు పొగిడే అవకాశం పరిమితంగా ఉంటుంది. ఒకవేళ పొగిడినా అంత నప్పదు. అందుకే.. తమ యువనేత మనసును దోచుకునేందుకు కిందా మీదా పడుతున్న తమ్ముళ్లకు ఇప్పుడు బంపర్ ఆఫర్ దక్కింది. లోకేశ్ ను మంత్రిని చేయాలన్న నిర్ణయం దాదాపు తీసేసుకున్న నేపథ్యంలో.. ఆయన పోటీ చేసే స్థానం కోసం తాను రాజీనామాకు సిద్దమంటూ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

పనిలో పనిగా.. మరికొందరు మంత్రులైతే.. లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా దూకుడుగా వ్యవహరించటంలో మంత్రి కొల్లు రవీంద్ర అందరి కంటే ముందున్నారు. ఆయన నేతృత్వంలో భేటీ అయిన బీసీ సెల్ నేతలు తాజాగా ఒక తీర్మానం చేశారు. లోకేశ్ కు మంత్రి పదవి ఇవ్వాలన్నది దాని సారాంశం.  మరి.. మంత్రి కొల్లు అంత ఫాస్ట్ గా ఉంటే.. పత్తిపాటి పుల్లారావు మాత్రం తక్కువ తింటారా? అందుకే ఆయన కూడా తన గళం విప్పి.. లోకేశ్ కు మంత్రి పదవి ఇస్తే ఏపీ ప్రజలకు.. పార్టీ క్యాడర్ కు మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా చేస్తున్న వ్యాఖ్యలు చేస్తూ.. లోకేశ్ లాంటి నేతను ఇంతకాలం పదవి ఇవ్వకుండా ఎందుకు ఉన్నారా? అన్న భావన కలగటం ఖాయం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English