నోట్ దిస్ పాయింట్; దమ్మున్న పత్రికను హరీశ్ పొగిడేశాడు

నోట్ దిస్ పాయింట్; దమ్మున్న పత్రికను హరీశ్ పొగిడేశాడు

తెలంగాణ సర్కారుకు.. దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతికి మధ్య వార్ ముగిసిందా? అంటే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అయుత చండీయాగం ముందు వరకూ ఆంధ్రజ్యోతికి.. తెలంగాణ సర్కారు మధ్య జరిగిన వార్ ను మర్చిపోలేం. ఒకనాటి తన మిత్రుడైన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగానికి పిలిచిన నాటి నుంచి ఇద్దరి మధ్య దూరం తగ్గిపోయిందన్న మాట వినిపించింది.

అందుకు తగ్గట్లే.. గతంలో తెలంగాణ సర్కారు మీద నిప్పులు చెరిగే దమ్మున్న పత్రిక ఈ మధ్యన కాస్త టోన్ డౌన్ చేసిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వార్తలు రాసే విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరం లేకున్నా.. గొడవలు పెట్టుకోవాలన్నది ఉద్దేశం కాకున్నా.. తప్పు జరిగినప్పుడు నిలదీసే అవకాశం తాజా మిత్రత్వం కారణంగా తగ్గుతుందా? అన్నది ఒక సందేహం.

ఇదిలా ఉంటే.. ఆ పత్రిక నిర్వహించిన కార్ రేస్ బంపర్ డ్రాకు ముఖ్యఅతిధిగా మంత్రి హరీశ్ రావును పిలవటం ఒక ఎత్తు అయితే.. ఆయన ఈ కార్యక్రమానికి హాజరై.. ఉల్లాసంగా పాల్గొనటం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్.. నిర్భయంగా నిజాలు వెల్లడిస్తూ.. పాఠకుల్ని ఆకట్టుకునేలా ముందుకు సాగుతుందని ఆంధ్రజ్యోతి మీద ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో పచ్చ పత్రికలుగా ముద్రేసిన తెలంగాణ అధికారపక్షం నేతల మాటకు భిన్నంగా ఆంధ్రజ్యోతిని పొగిడేసిన తీరు చూసినప్పుడు..  ఇరు వర్గాల మధ్య కొత్త బంధం సరికొత్తగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు