నాయుడు భోజనం గురించి ఇదో క్రేజీ ముచ్చ‌ట‌

నాయుడు భోజనం గురించి ఇదో క్రేజీ ముచ్చ‌ట‌

కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరానికి వచ్చినప్పుడల్లా మీడియాతో గాని, లేదా కార్యకర్తల సమావేశాల్లో గాని ఏదో ఒక ఆసక్తికర కొత్త విషయాన్ని చెబుతున్నారు. ఇటీవ‌ల‌ విజయవాడలో జరిగిన జేఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్ కుమార్ సభకు ప్రతిగా నిర్వహించిన సభలో పాల్గొన్న వెంకయ్య తనను ఎందరు నిరాశపరచినా బీజేపీలో ఎలా చేరాననేది వివరించారు. ‘నెల్లూరు జిల్లా కుగ్రామానికి చెందిన నేను ఆరోజుల్లో జనసంఘ్‌లో చేరాలనుకున్నా. ఆ గ్రామానికి చెందిన ఓ పెద్దయ్య నా మంచి కోరి...ఏం వెంకయ్యా! ఏదో పేరుకూడా తెలియని సంఘ్ పార్టీలో చేరుతున్నావంట. అసలు ఆ పార్టీ ఉత్తరాదికి, అందునా వ్యాపారులు, బ్రాహ్మణులకే పరిమితమట. ఇంకో విషయం తెలుసా! నీకేమో మాంసాహారం బహు ఇష్టం. ఆ పార్టీ సమావేశాల్లో ఒట్టి శాఖాహారమేనట. బాగా ఆలోచించు’ అన్నారు.

దీంతో మ‌థ‌నంలో ప‌డ్డ నేను దీని గురించి ఆరా తీశా. పార్టీ మీటింగ్‌లు ఈటింగ్ కోసం కాదు, సభ్యత్వం తీసుకున్నవారు శుభ్రంగా మాంసాహారం భుజించవచ్చు’ అంటూ ధైర్యాన్నిచ్చారు. అప్పటికే ఎంతోకొంత ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఉండటంతో జనసంఘ్‌లో చేరా. నాటి నుంచి నేటి వరకు తృప్తిగా మాంసం తింటూనే ఉన్నా. వయస్సు పెరిగి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో డాక్టర్లు #జీవితాంతం సరిపడే మాంసం ఇప్పటికే ఎంతో ఎక్కువగానే తిన్నావు, ఇక తగ్గించమన్నారు. దాంతో త‌గ్గించాను అంటూ వెంక‌య్య త‌న భోజ‌న ఆస‌క్తిని వివరించారు. అయితే వెంకయ్య ఓ విషయం చెప్పటం మరిచారు. నాడు కమ్యూనిస్టులు గోడలపై ‘జనసంఘ్’ బోర్డులపై ముందు అక్షరంగా భోజ‌న సంఘ్‌ అని చేర్చి ఎగతాళి చేసేవారు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు