కలకలం; హరికృష్ణ.. నానిల కారు జర్నీ

కలకలం; హరికృష్ణ.. నానిల కారు జర్నీ

ఏపీ రాజకీయాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకోనున్నాయా? ఇప్పటివరకూ ఏపీ విపక్షానికి షాకుల మీద షాకులిస్తున్న ఏపీ అధికారపక్షం మరో షాక్ ఇవ్వబోతుందా? లేక.. అధికారపక్షం షాకులకు ధీటుగా ఏపీ విపక్షం కూడా షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేసిందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం పలువురిని విస్మయానికి గురి చేయటంతో పాటు.. ఆసక్తికర చర్చకు తావిచ్చిందని చెప్పాలి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బావ మరిది హరికృష్ణ విజయవాడకు వచ్చారు. ఇదేం పెద్ద విషయం కానప్పటికీ.. ఆయన తన బెజవాడ పర్యటనలో ఏపీ విపక్ష ఎమ్మెల్యే కొడాలి నాని కారులో రావటం ఆసక్తికర చర్చగా మారింది. తన బావ చంద్రబాబు తీరుపై గత కొద్దికాలంగా అసంతృప్తిగా ఉన్న హరికృష్ణ.. ఆయన కుమారుడు యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేసిన ఎన్టీఆర్.. 2014 ఎన్నికల సందర్భంగా ముఖం కూడా కనిపించని పరిస్థితి. అంతర్గత విభేదాలు.. కుటుంబాల మధ్యనున్న కలహాల కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందన్న వాదనలు వినిపిస్తే.. ఇదంతా జూనియర్ స్వయంకృతాపరాధంగా అభివర్ణించిన వారూ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా విజయవాడలోని బందర్ రోడ్డులో కొత్తగా నిర్మించిన వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాని కారులో హరికృష్ణ రావటం గమనార్హం. ఎన్టీఆర్ వీరాభిమానిగా.. హరికృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రుడైన కొడాలి నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమకున్న వ్యక్తిగత అనుబంధంతో ఒకే కారులో వచ్చారా? లేక.. ఏదైనా రాజకీయ అంశం అంతర్లీనంగా ఉందా? అన్నది మరికొన్ని రోజులు గడిస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు