విమర్శలే.. విమర్శలు; చీకటి ఒప్పందం.. కొత్త సినిమా

విమర్శలే.. విమర్శలు; చీకటి ఒప్పందం.. కొత్త సినిమా

తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ పై తెలంగాణకాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కేసీఆర్ ప్రజంటేషన్ మీద విపక్షాలు దాదాపుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విమర్శల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల స్వరం తీవ్రంగా వినిపిస్తోంది. కేసీఆర్ ప్రజంటేషన్ మీద తాజాగా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గళం విప్పారు.

సార్వత్రిక ఎన్నికల నుంచి పెద్దగా బయటకు రాకుండా.. కామ్ గా ఉంటూ.. పరిస్థితుల్ని గమనిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేత.. మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజంటేషన్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కొత్త సినిమా చూపించారన్నారు. అసెంబ్లీ వేదికగా.. కేసీఆర్ ప్రదర్శించిన ప్రజంటేషన్ ను సినిమాగా అభివర్ణించి.. అందులోని అంశాలపై తీవ్రంగా విమర్శించారు. గోదావరి నది తీర ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా మెదక్ జిల్లాకు నీరు తరలిస్తే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.

శ్రీధర్ బాబు వ్యాఖ్యలు ఈ తీరులో ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు సంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ అవకాశం కల్పించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ప్రతిపక్ష వాదనను వినేందుకు అవకాశం కల్పించకపోవటాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర సర్కారుతో చీకటి ఒప్పందం చేసుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని శాశ్వతంగా తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయటం గమనార్హం. ఏది ఏమైనా కేసీఆర్ ప్రజంటేషన్ వన్ సైడెడ్ గా కాకుండా.. తానిచ్చిన ప్రజంటేషన్ మీద విపక్షాలు తమ సందేహాల్ని తీర్చుకునేలా చర్చకు అవకాశం ఇస్తే బాగుండేదేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు