మళ్లీ ఉద్యమ మూడ్ తీసుకొచ్చిన కేసీఆర్

మళ్లీ ఉద్యమ మూడ్ తీసుకొచ్చిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో తెలంగాణ జల విధాన ప్రకటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ పోరాటం... పరిస్థితులను వివరిస్తున్నారు. తెలంగాణ సాగు నీటి కథ రాస్తే రామాయణమంతా.. వింటే భారతమంతా అంటూ మొదలు పెట్టిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతుల పరిస్థితులను వివరించారు. ఆనాడు తెలంగాణ బతుకులు బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయి అంటూ తనదైన శైలిలో ప్రాసలతో ప్రసంగిస్తున్నారు. దేశంలో ఎక్కడా చూసినా పాలమూరు వలస కూలీలే కనిపించేవారు అని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఛలో అసెంబ్లీ చేపడితే పోలీసులు కాల్పులు జరిపారు అని గుర్తు చేశారు. ఆంధ్రా పాలనలో తెలంగాణ రైతాంగం దగా పడిందంటూ మరోసారి ఉద్యమ మూడ్ లోకి తీసుకెళ్లారు.  

తాను ఎందుకు ఉద్యమం చేపట్టానన్నది కేసీఆర్ సభకు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం దక్కదన్న స్థిర నిర్ణయంతోనే ఉద్యమంలోకి దూకానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఉద్యమంలోకి దూకే ముందు నాడు ఉన్న పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. పలు కీలక సమస్యలపై ఎన్ని లేఖలు రాసినా నాటి పాలకుల నుంచి స్పందన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్ బాగ్ లో జరిగిన ఉద్యమంపై నాటి చంద్రబాబు సర్కారు జరిపిన కాల్పులతో... ఇక తెలంగాణకు న్యాయం దక్కదని నిర్ధారించుకున్నానన్నారు. వెనువెంటనే అప్పటిదాకా తనకున్న అన్ని రాజకీయ పదవులను త్యజించి తెలంగాణ ఉద్యమంలోకి దూకానని ఆయన తెలిపారు.  సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గణాంకాలను వివరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు