తెలంగాణ మంత్రిని చంద్రబాబు కొట్టారా?

తెలంగాణ మంత్రిని చంద్రబాబు కొట్టారా?

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం టీఆరెస్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఓ సంచలన ఆరోపణ గందరగోళానికి దారి తీసింది. తెలంగాణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన రావడమే కాకుండా కాంగ్రెస్, టీఆరెస్, టీడీపీ సభ్యుల మధ్య వాదనలకు కారణమై చివరకు సభ వాయిదా పడాల్సి వచ్చింది.  ఎప్పుడో జరిగిందని చెబుతూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఓ ఘటనను గుర్తుచేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో తనను కొట్టారంటూ పాత ఘటనలను ఆయన గుర్తు చేయగా....  టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన రేవంత్ రెడ్డి... భవిష్యత్తులో కేసీఆర్ కొట్టారని కూడా పోచారం చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అందుకున్న జీవన్ రెడ్డి... చంద్రబాబు చేతిలో దెబ్బలు తిని కూడా టీడీపీలోనే ఎలా కొనసాగారని మంత్రిని నిలదీశారు.

కాగా పోచారంను చంద్రబాబు ఎప్పుడు కొట్టారు? ఎందుకు కొట్టారు? అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు ఆగ్రహిస్తే ఆగ్రహించొచ్చు కానీ అలా కొట్టే మనిషే కాదంటూ దీనిపై తెలంగాణ శాసనసభలో సభ్యులు తమలో తాము మాట్లాడుకోవడం కనిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు.. గతంలో చంద్రబాబు కేబినెట్లో గనుల శాఖ మంత్రిగానూ పనిచేశారు. మరోవైపు రేవంత్ ప్రస్తుతం టీడీపీలో ఉండగా.. జీవన్ రెడ్డి కూడా ఒకప్పుడు టీడీపీ నేతే. అలాగే తెలంగాణ సభలో చాలామందికి టీడీపీ నేపథ్యం ఉండడంతో పాటు చంద్రబాబు బాగా తెలుసు. అలాంటిది పోచారం ఇలా చంద్రబాబుపై చేసిన సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సంచలన ఆరోపణలు, వాటిపై విపక్ష నేతల ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు