ఆ ఇష్యూలో 59 మందికి 39 మంది జ్యోతుల వైపా?

ఆ ఇష్యూలో 59 మందికి 39 మంది జ్యోతుల వైపా?

ఇప్పటికే నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ విపక్షానికి ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. అయితే.. ఈ సమస్య జగన్ తన చేజేతులారా కొని తెచ్చుకున్నదే కావటం గమనార్హం. పార్టీ సీనియర్ నేత.. జగన్ కు సన్నిహితుడిగా పేరున్న జ్యోతుల నెహ్రు పార్టీ వీడటానికి రంగం సిద్ధం చేసుకోవటంతో ఆయన్ను నిలువరించేందుకు జగన్ ప్రయత్నాలు షురూ చేశారు. అయితే.. తనను కలిసేందుకు వచ్చిన సన్నిహితులు.. కార్యకర్తలతో మాట్లాడిన నెహ్రు తాను పార్టీని వీడాలనుకోవటానికి దారి తీసిన పరిణామాల్ని ఏకరవు పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూటిగా మాట్లాడాలని.. ఆ పదవికి తనను పనికిరానని చెప్పటం తనను ఎంతో కుంగదీసినట్లుగా నెహ్రు చెప్పుకోవటం కనిపించింది. పీఏసీ ఛైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పార్టీలోని 59 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నా తనకు పార్టీ పదవి ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పీఏసీ పదవికి సరిపోని తాను.. పార్టీ ఉప నేతగా మాత్రం ఎలా సరిపోతానంటూ జ్యోతుల వేస్తున్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పే వాళ్లు లేకపోవటంతో పాటు.. ఇంతలా అవమానించిన జగన్ తో ఉండటం సరికాదన్న భావనను జ్యోతుల ముందు ఆయన సన్నిహితుతు చెబుతున్నట్లగా తెలుస్తోంది.పార్టీ మారాలన్న తన అభిప్రాయానికి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభిస్తున్న వేళ.. సైకిల్ ఎక్కే దిశగా జ్యోతుల అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు