కృష్ణా పుష్కరాల్లో స్వీడన్ టెక్నాలజీ

కృష్ణా పుష్కరాల్లో స్వీడన్ టెక్నాలజీ

నవ్యాంధ్ర రాజధానిలో కీలక నగరంగా ఉన్న విజయవాడలో విద్యుత్ శాఖ కూడా ఆధునిక హంగులకు శ్రీకారం చుడుతోంది. కృష్ణానది పుష్కరాల సందర్భంగా వీటిని తొలిసారి ప్రవేశపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక్క స్వీడన్లోనే ఉన్న స్లీవ్డు కండెక్టర్తో విద్యుత్తు వైర్లు వేయాలని ఎపిఎస్పిడిసిఎల్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వచ్చే ఆగస్టులో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పుష్కరఘాట్లకు విద్యుత్ లైన్ల వినియోగంలో స్లీవ్డు కండెక్టర్ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కర ఘాట్లలో ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించేందుకు ఈ విధానం చక్కగా ఉపయోగప డుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ విధానంలో కిలోమీటరుకు సుమారు రూ.23 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. జిల్లాలో ఉన్న పుష్కర ఘాట్లకు 50 కిలో మీటర్ల దూరం వరకూ నూతన విధానం ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. ఇందుకు సుమారు రూ.11.50 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. విద్యుత్ శాఖ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతాయని ఎపిఎస్పిడిసిఎల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేయడంతోపాటు 90 డ్రమ్స్ కేబుల్ విజయవాడకు తీసుకొచ్చారు.ఎట్టిపరిస్థితుల్లోనూ మే నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే నగరం మొత్తం ఎక్కువ ఎత్తు ఉండే స్తంభాలను ఏర్పాటు చేసే పనిలో ఆ శాఖ ఉద్యోగులు ఉన్నారు.

నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు, జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రూ.50 కోట్లతో స్లీవ్డ్ కండెక్టర్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా వన్టౌన్, కాళేశ్వరరావు మార్కెట్, కొత్తపేట, భవానీద్వీపం, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, బీసెంట్ రోడ్డు, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రాంతాలతోపాటు షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతాల్లో స్లీవ్డ్ కండెక్టర్ వైర్లు వేయడం ద్వారా షార్టు సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా నివారించడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు