జానాసాబ్.. రోజుకో స్టార్ ను తయారు చేస్తున్నారా?

జానాసాబ్.. రోజుకో స్టార్ ను తయారు చేస్తున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత.. విపక్ష నేత జానారెడ్డి మాంచి ఊపులో ఉన్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు బాగుందని.. తన సీనియార్టీని ప్రదర్శించటంతో పాటు.. ఆయన అనుసరిస్తున్న వ్యూహం తెలంగాణఅధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేలా చేయటంతోపాటు.. ఒత్తిడి పెంచేలా చేయటంలో జానాసాబ్ సక్సెస్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది.

బడ్జెట్ పై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును నిశితంగా విమర్శించటంతో పాటు.. పెద్దరికంతో చేసిన ప్రసంగంలో.. బడ్జెట్ లెక్కల్లోని తప్పుల్ని సమర్థవంతంగా ఎత్తి చూపారన్న మాట విపక్షంలోనే కాదు.. అధికారపక్షంలోనూ వినిపించటం గమనార్హం. తెలంగాణ అధికారపక్షాన్ని తన మాటలతో తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ముగిసి బయటకు వస్తున్న వేళ.. లాబీల్లో పలువురు జానారెడ్డిని అభినందించారు. బడ్జెట్ పై రోజుకొకరితో బాగా మాట్లాడిస్తున్నారని.. వ్యూహం బాగుందన్న ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

జానారెడ్డి తర్వాత భట్టి.. జీవన్ రెడ్డిలు ఇలా రోజుకొకరు చొప్పున తెలంగాణ అధికారపక్షం తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారని.. బడ్జెట్ సమావేశాల్లో మీరే స్టార్ అంటూ ప్రశంసించారు. ఈ పొగడ్తలకు స్పందించిన జానా.. రోజుకో స్టార్ ను తయారు చేస్తున్నా.. స్టార్లను తయారు చేయటమే నా పని అంటూ ఆయన పొంగిపోతూ బదులివ్వటం గమనార్హం. కేసీఆర్ లాంటి నేతను తక్కువ అంచనా వేయటం సరికాదేమో. ఇప్పటివరకూ విపక్ష సభ్యుల వాయిస్ మాత్రమే వచ్చింది. వీటికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కానీ నోరు విప్పితే ఎలా ఉంటుందో..? ఆ కార్యక్రమం అయ్యాక పొగిడేసుకుంటే బాగుంటుందేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English