రవి ప్రకాష్, నారా లోకేష్ న్యూస్ చానల?

రవి ప్రకాష్, నారా లోకేష్ న్యూస్ చానల?

తెలుగు మీడియా ప్రపంచంలో సంచలనం సృష్టించిన టీవీ9 వ్యవహారం కొలిక్కి వచ్చింది. తెలంగాణా సీఎం అనుచరుడి చేతుల్లోకి జారిపోతోందని, ఈనెలాఖరుతో ఆ చానెల్ లో కొత్త శకం మొదలవుతోందని తెలుస్తోంది. విఖ్యాత వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరావు ఆధ్వర్యంలో చానెల్ ప్రస్థానం ప్రారంభం కాబోతోందని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అందరిలో ఓ కొత్త ప్రశ్న వినిపిస్తోంది. టీవీ9 పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న రవి ప్రకాష్ పరిస్థితి ఏమిటన్నది ఆ చర్చ సారాశం. టీవీ9లో వాటాదారుడిగా ఉంటూనే సీఈవో హోదాలో ఇన్నాళ్లుగా చక్రం తిప్పారు. తెలుగు మీడియాలో కీలకపాత్రధారిగా మారిపోయారు. టీవీ9 సహాయంతో రాజకీయ వ్యవహారాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు. గతంలో తెరమీద పదే పదే కనిపించిన రవిప్రకాష్ ఇటీవల కేవలం తెరచాటు వ్యవహారాలకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు చానెల్ యాజమాన్యం తెలంగాణా నేతల చేతుల్లోకి వెళ్లడం రవి ప్రకాష్ ని అదే స్థానంలో ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదు.

దాంతో రవి ప్రకాష్ ఏపీ లో మీడియా వ్యవహారాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. అయితే అది వెంటనే చేస్తారా..లేక ఒక ఏడాది విరామం తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక మీడియా అంటూ రంగంలో దిగుతారా అన్నదే ప్రశ్నగా చెబుతున్నారు. అమరావతి కేంధ్రంగా ఇప్పటి వరకూ చాలామంది చానెల్ పెడతామంటూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. ఏపీలో తొలి చానెల్ కోసం సన్నాహాలు చేసి వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు రవి ప్రకాష్ ఆ వ్యవహారంలో తలదూర్చబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇది నిజంగా కార్యరూపం దాలుస్తుందా..లేదా అన్నది చూడాలి. అమరావతిలో కూడా తానే ముందుండాలని రవి ప్రకాష్ ఆశిస్తే అది ఎప్పటికి ఆచరణలోకి వస్తుందన్నది చూడాలి.

ఏపీకోసం ప్రత్యేకంగా ఓ చానెల్ కోసం సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇప్పటికే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అదే సందర్భంలో చంద్రబాబు కి కాస్త సన్నిహితుడిగా పేరున్న రవి ప్రకాష్ మీడియా కోసం ప్రయత్నం చేస్తే అది ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అది చానెల్ పై ముద్రపడకుండా పని పూర్తిచేయడంలో రవి ప్రకాష్ సిద్ధహస్తుడు కాబట్టి అన్ని జాగ్రత్తలతోనే ఇలాంటి పని జరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తంగా ఏం జరుగుతుందన్నది ఆసక్తిదాయకమే. ఇవన్నీ అంచనాల ఆధారంగా వినవస్తున్న చర్చోపచర్చలు అనేది మీకందరికీ తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు