జానాకు కేసీఆర్ పై కోపం ఎందుకొచ్చింది?

జానాకు కేసీఆర్ పై కోపం ఎందుకొచ్చింది?

ఇంతకాలం తెలంగాణలోని టీఆరెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మధ్య దోబూచులాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి చాలాకాలం తరువాత టీఆరెస్ పై తన స్థాయికి తగ్గ రీతిలో జోరు చూపించారు. జాతీయ స్థాయిలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలుగు రాష్ర్టాలపై దృష్టిపెడుతున్న నేపథ్యంలో జానారెడ్డి జాగ్రత్తపడినట్లుగా భావిస్తున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏకంగా పార్టీ అధిష్ఠానమే పోరాటానికి దిగడం... అదేసమయంలో తెలంగాణ రాష్ర్టం ఇచ్చినా కూడా తెలంగాణలో పార్టీ కష్టాల్లో ఉండడం, కేసీఆర్ పాలనపై ఆమె రీసెంటుగా ఆరా తీయడంతో సోనియానేతృత్వంలో పార్టీ బలోపేత చర్యలు మొదలు కానున్నాయన్న సూచనలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జానా తన దోబూచులాటకు పుల్ స్టాప్ పెట్టి జోరు పెంచినట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో టీఆరెస్ క్రమంగా బీజేపీకి దగ్గరవుతుండడం కూడా జానా కోపానికి కారణమని తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీలో జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఏకిపారేయడాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. అంకెలతో ఆటలాడుతూ, మాటలతో మాయ చేస్తూ, ప్రజలను భ్రమింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని జానా ఆరోపించారు. మూడోసారి కూడా గత పొరపాట్లనే కొనసాగిస్తూ అవగాహన రాహిత్యంతో బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. రెండు బడ్జెట్ల సందర్బంగా తాను చెప్పిన మాటలు నిజమయ్యాయన్నారు. రూ.1.15 లక్షల కోట్లలో రూ.30 వేల కోట్లు రాదని చెప్పానని అదే జరిగిందన్నారు. మిషన్కాకతీయలో రూ.600 కోట్లు మించి ఖర్చు చేయలేరని అన్నానని ఇదీ నిజమైందన్నారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్లో 84 వేల కోట్లు వ్యయం చేశారన్నారు. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ.58 వేల కోట్లు, ప్రణాళికా వ్యయం రూ.26,000 కోట్లు మాత్రమే అని అన్నారు. ప్రణాళికా వ్యయం 31 శాతం మించి వ్యయం కానప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 51 శాతం ప్రణాళికా వ్యయం ఎలా చేస్తారని జానా ప్రశ్నించారు. వచ్చే ఏడాది కూడా ప్రణాళికా వ్యయం 37 వేల కోట్లకు మించదని అన్నారు. ఇందులో 25 వేలకోట్లు సాగునీటికి వ్యయం చేస్తే మిగిలిన వాటిపై ఎంత వ్యయం చేస్తారని అన్నారు. జానా మాట తీరు విశ్లేషకులను ఆకట్టుకుంది. ఆయన ఇటీవల ఉన్నట్లు కాకుండా చాలా సునిశితంగా అధ్యయనం చేసి మరీ ప్రభుత్వాన్ని దులిపేయాలన్న ఉద్దేశంతోనే వచ్చారని చెబుతున్నారు.

అదే సమయంలో జానారెడ్డి ప్రభుత్వ రాజకీయాలను కూడా నిర్మొహమాటంగా ఎండగట్టేశారు. రాష్ట్రంలో వేరే పార్టీ ఉండకూడదని, ఇతర పార్టీ వారు ఓట్లు అడగడానికి వీల్లేదు అనే రీతిలో మంత్రులు వ్యవహరిస్తున్నారని ఇది మంచి ధోరణి కాదన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులోని నియంతృత్వ ధోరణికి ఇది సంకేతకమని గుర్తించాలన్నారు. ఒకే ఎమ్మెల్యేగా ఉన్న జయలలిత తమిళనాడులో తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిందని, ఇద్దరు ఎంపీలు ఉన్న భాజపా అత్యధిక మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రాలేదా? అని దేశ రాజకీయాలను ప్రస్తావిస్తూ.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజాసమస్యల పరిష్కారం ముఖ్యమని గుర్తెరగాలన్నారు.

మొత్తంగా చూసుకుంటే జానారెడ్డి టీఆరెస్ పై ఎన్నడూ చూపని దూకుడు చూపారని చెప్పక తప్పదు. ఇంతవరకు ఆయన ప్రభుత్వంలో సహకార ధోరణిలోనే వెళ్లి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు మూటగట్టుకున్నారు. తాజా సెషన్స్ లో జానా తన పూర్వపు దూకుడును, సీనియారిటీని చూపించి టీఆరెస్ లో కొత్త భయాన్ని కలిగించారు. జానా వంటి నేతలు ఇలాగే తమ స్థాయికి తగ్గట్లుగా వ్యవహరిస్తే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కట్టడి చేయడానికి, దారిలో పెట్టడానికి వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English