టీఆర్ఎస్ ఎవర్నీ వదల్లేదన్నమాట !

టీఆర్ఎస్ ఎవర్నీ వదల్లేదన్నమాట !

బహుశా అధికార పార్టీ చేరికలు దేశంలో ఎక్కడా జరగనంతగా తెలంగాణలో జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ... ఇన్నాళ్లు టీఆర్ఎస్ చెప్పిన దానికి వాస్తవాలకు పొంతన లేదని ఒక సీనియర్ నేత ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన మాటతో స్పష్టమైంది. అసెంబ్లీ సమావేశాలపుడు సీనియర్లు మీడియాతో ముచ్చటిస్తుంటారు. రాజకీయ సీనియర్లు మీడియా సీనియర్లను కలవడానికి అది మంచి ప్లేస్ కూడా. తాజాగా మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ సర్కారులో మంత్రి పదవుల్ని చేజిక్కించుకున్న వారి గురించి ప్రస్తావించారు. పలువురు జంపింగ్ జిలానీల గురించి మాట్లాడుతూ ''తమ లాంటి వాళ్లు వెళితే పదవులు రాకుండా ఉంటాయా?'' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కడుపులో దాచిన రహస్యాన్ని కక్కేశారు. ''తనకు టీఆర్ఎస్ ఆఫర్ వచ్చినా పట్టించుకోలేదు'' అని తేల్చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని.. తెలంగాణ ప్రజల్లో తమ పట్ల సానుభూతి ఉందని గొప్పలు చెప్పుకున్న ఆయన.. తాను ప్రాతినిధ్యం వహించే నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నాయకత్వంతో కలిసి పని చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అసాంఘికశక్తులతో కలిసి పని చేస్తున్నారని.. అలాంటి వారితో తాము పని చేయటమేమిటని తీసిపారేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... అందరూ టీఆర్ఎస్ అభివృద్ధి చూసి అని కబుర్లు చెప్పి ఆ పార్టీలోకి చేరుతున్నా అదంతా స్క్రిప్టేనని కోమటిరెడ్డి మాటలు రుజువు చేస్తున్నాయి. దీన్ని పట్టుకుని లాగిన కూపీలో తేలిందేంటంటే.. టీఆర్ఎస్ తెలంగాణలో మజ్లిస్ తప్ప {వాళ్లు రారు కాబట్టి} ఇక ఏ పార్టీ వాళ్లని వదలకుండా అందరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి చేర్చుకుందామని ప్రణాళిక రచించిందట. అందులో భాగంగా ప్రతి పార్టీలోని ప్రతి ఎమ్మెల్యేకి ఆఫర్ ఇచ్చిందట. ఏ ఒక్క సీనియరును వదల్లేదు. టీఆర్ఎస్ మొదట్లో ట్రై చేసి లిస్టులో రేవంత్ రెడ్డి కూడా ఉండటం విశేషం. అతను లొంగకపోవడంతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాకపోతే ఈ జంపింగ్ మిషన్ పూర్తిగా విజయవంతం కాకపోయినా చాలా వరకు అయ్యింది. టీఆర్ఎస్ దురాశ కాకపోతే ప్రతి ఎమ్మెల్యే తన వాడే ఉండాలనుకోవడం ఏమిటి? ఇదేమైనా రాజరికమా? అయినా ప్రతిపక్షం లేకపోతే రాజకీయాల్లో మజా ఏముంటుంది? పాలకులకయినా... ప్రజలకయినా! టీఆర్ఎస్ అనుకున్న ప్లాను గనుక సక్సెస్ అయి ఉంటే... గిన్నిస్ రికార్డేనేమో !

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English