లైసెన్స్ లేకుండా బైక్ నడిపినందుకు జైలుశిక్ష

లైసెన్స్ లేకుండా బైక్ నడిపినందుకు జైలుశిక్ష

అనుకున్నట్లే చేశారు. మాటలు కాదు చేతల్లోనూ శిక్ష తప్పదని తేల్చేశారు. నిబంధనల్ని అమలు చేసే విషయంలో ఎలాంటి మొహమాటం లేదన్నట్లుగా వ్యవహరించిన పోలీసులకు తగ్గట్లే కోర్టు సైతం కఠినంగా స్పందించింది. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఇద్దరికి తాజాగా ఒక రోజు జైలుశిక్ష విధించి సంచలనం సృష్టించారు.

రోడ్డు ప్రమాదాలు అరికట్టే పనిలో భాగంగా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి ఒకరోజు జైలుశిక్ష విదిస్తామంటూ కొద్దిరోజులుగా పోలీసులు జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని నగరవాసులు పెద్దగా పట్టించుకున్నట్లు లేదన్న మాట వినిపించింది. కొద్దిరోజులుగా తనిఖీలు చేసి.. హెచ్చరికలు జారీ చేస్తూ జరిమానాను విధిస్తున్న పోలీసులు.. తాజాగా మాత్రం కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.

లైసెన్స్ లు లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఇద్దరిని నాంపల్లి కోర్టుకు హాజరు పరిచారు. వీరి ఉదంతంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఇద్దరికి ఒక్కోరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో.. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపి జైలుశిక్ష అనుభవించిన వ్యక్తులుగా నిలిచారు. తాజాగా జైలుశిక్ష విధించిన ఇద్దరిలో ఒకరు ఆటోడ్రైవర్ ఏడుకొండలు కాగా.. మరొకరు విద్యార్థి ఇస్మాయిల్ కావటం గమనార్హం. తాజా ఉదంతం నేపథ్యంలో.. లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడిపితే నేరుగా జైలుకేనన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు సుమా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు