జగన్ కు మద్దతుగా మాట్లాడిన రాజు

జగన్ కు మద్దతుగా మాట్లాడిన రాజు

బీజేపీ-టీడీపీల మధ్య పెరుగుతున్న దూరానికి మరో ఉదాహరణ తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్... ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అమరావతి మొదలుకొని పోలవరం, ఏపీ ప్రత్యేక హోదా వరకు అన్నింటిపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో జగన్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం దాటవేయడంతో బీజేపీ ఆయనకు మద్దతుగా నిలిచింది.

జగన్ తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగు ముందుకు పడటం లేదని పేర్కొంటూ అయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుపట్టినప్పటికీ ఈ మొత్తాలు పెంచేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు బినామీ కాబట్టే ఇలా జరిగిందని ఆరోపించారు. జగన్ ఆరోపణల అనంతరం ప్రసంగించిన మంత్రి దేవినేని ఉమా దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా ముగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ పోలవరం గురించి వచ్చిన సూటి ప్రశ్నకు ప్రభుత్వం జవాబివ్వాలని కోరారు. కాంట్రాక్టర్ శీనయ్యకు రూ.23 కోట్లకు బదులు రూ.74 కోట్లు చెల్లించడం ఏంటని ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అడిగిన ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని మంత్రి ఉమాను ప్రశ్నించారు.

అధికార పక్షంతో కలిసి నడుస్తున్న బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఫ్లోర్లీడర్ ఏకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే డిమాండ్ చేయడంతో టీడీపీ సభ్యులు ఒకింత ఇబ్బందికి గురయినట్లు కనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు