సమ్మర్ లో బీజేపీ కూల్ కూల్

సమ్మర్ లో బీజేపీ కూల్ కూల్

సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతటా విజయఢంకా మోగించి తిరుగులేని మెజారిటీతో ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ పార్లమెంటులో మాత్రం తన మాట నెగ్గించుకునే క్రమంలో కష్టాలు పడుతోంది. లోక్ సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో బలం లేక తన కీలక బిల్లులను నెగ్గించుకోలేక చతికిలపడుతోంది. అయితే.... త్వరలో బీజేపీకి ఆ కష్టాలు తీరబోతున్నాయి. పెద్దసంఖ్యలో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడం.... కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది సభ్యులు గెలిచే అవకాశాలు లేకపోవడంతో రాజ్యసభలోనూ మిత్రపక్షాలతో కలిసి బలం పెంచుకోవడానికి బీజేపీకి అవకాశం ఏర్పడుతోంది. దీంతో రాజ్యసభలో బీజేపీ కష్టాలకు తెరపడబోతోంది.

కాంగ్రెస్కు చెందిన మొత్తం 21మంది సభ్యత్వం ముగుస్తుండగా, కేవలం 17మంది మాత్రమే తిరిగి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య కొంత తగ్గనుంది. అదేసమయంలో బీజేపీ మిత్రపక్షాల బలం కూడా పెరగనుంది. ఆంధ్ర, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సభ్యులు హనుమంతరావు, శీలం, జయరాం రమేష్ రిటైరవుతున్నా, కాంగ్రెస్ ఈసారి ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో బీజేపీకి రాజ్యసభలో మంచి రోజులు రానున్నాయి.

మొత్తం 69 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం త్వరలో పూర్తికానుంది. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, ఇంధన మంత్రి పియూష్ గోయల్, కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్, జెడి {యు} అధినాయకుడు శరద్ యాదవ్, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకె అంటోని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సహా మొత్తం 69మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం త్వరలో ముగియనుంది.

ఏప్రిల్లో 12మంది సభ్యుల పదవీకాలం ముగియనుంది. అనంతరం జూన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యులు సహా మొత్తం 21మంది సభ్యులు రిటైరవుతారు. జులైలో అత్యధికంగా 34మంది సభ్యత్వకాలం ముగుస్తోంది. ఆగస్టులో రైల్వే మంత్రి సురేష్ ప్రభు, గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేంద్ర సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నుంచి జులై మధ్యలోనే 67 మంది రిటైరవుతుండగా ఆగస్టులో మరో ఇద్దరితో కలిసి మొత్తం 69 మంది రిఐటర్ కానున్నారు.

ఏప్రిల్లో రిటైరవుతున్న 12మందిలో ఆంటోని, ఎంఎస్ గిల్, నరేష్ గుజ్రాల్, అశ్వినీ కుమార్ తదితరులున్నారు. ఏప్రిల్లో ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.  జూన్ లో ఏపీకి చెందిన వైఎస్ చౌదరి, నిర్మలా సీతారామన్, జయరాం రమేష్, జెడి శీలం, తెలంగాణకు చెందిన వి.హనుమంతరావు, గుండు సుధారాణితో పాటు మొహిసిన్ కిద్వాయి, చందన్ మిత్రా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండేజ్తోపాటు 21మంది రిటైరవుతారు.  జులైలో శరద్ యాదవ్, కెసి త్యాగి, అంబికా సోని, సతీష్ శర్మ, సతీష్ మిశ్రా, ముక్తార్ అబ్బాస్ నఖ్వి, రాంజెత్మలానీ, పియూష్ గోయల్, ఆనంద్ శర్మతోపాటు మొత్తం 34మంది సభ్యులు రిటైరవుతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు