తెలంగాణ ప్రతిపక్షాలకు ఒక్క చాన్స్ కూడా లేదా?

తెలంగాణ ప్రతిపక్షాలకు ఒక్క చాన్స్ కూడా లేదా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్, పలు సంక్షేమ పథకాల వల్ల కారు జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడ ప్రతిపక్షాలు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస ఎన్నికల వైఫల్యాల సందర్భంగా గత ఎన్నికల్లో కొత్త వాదన తెరమీదకు వచ్చింది. ఓట్లను కొల్లగొట్టేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎలక్ట్రానిక్ యంత్రం ద్వారా ఓటు వేయగానే ఓటు వేసినట్టు రసీదు అందించేలా చూడాలని డిమాండ్ చేశాయి. ప్రతపక్షాల డిమాండ్ల నేపథ్యంలో తాజాగా ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వరంగల్ ఉప ఎన్నికలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అనుమానాలకు అధారాలు లేవని కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోయిన వారు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఈవీఎంల వల్లే ఓడిపోయామని ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్ తాము ఆరోపణల కేంద్రంగా మారవద్దని భావించి ఈ క్రమంలో ఖమ్మం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా 35 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలకు ప్రింటర్లను అమర్చుతున్నారు. ఈ విధానంలో ఓటరు ఏ పార్టీకి ఓటు వేశాడో రసీదులో కనిపించని పక్షంలో ఓటరు పోలింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఎన్నికల అధికారులు విచారణ జరుపుతారు. ఒకవేళ ఓటరే తప్పుడు ఫిర్యాదు చేసినట్టు తేలితే చట్ట ప్రకారం అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ దేశంలో రెండేళ్ల క్రితమే ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా ఎనిమిది పార్లమెంటు నియోజక వర్గాల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. ఇందులో గుజరాత్లోని గాంధీనగర్ సెగ్మెంట్ ఒకటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు