చిన్నమ్మ పోలవరంపై నీళ్ళు చల్లేసింది

చిన్నమ్మ పోలవరంపై నీళ్ళు చల్లేసింది

నవ్యాంధ్రప్రదేశ్కు కీలకంగా మారిన పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర బడ్జెట్లో కేవలం వందకోట్ల రూపాయలు కేటాయించిన తీరుపై ఇప్పటికే ప్రతిపక్షాలు, ఆంధ్రప్రదేశ్ అభిమానులు ఆందోళన చెందుతుండగా.... బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అగ్నికి ఆజ్యం పోసేలా మరింత ఘాటు కామెంట్లు చేశారు. ఆమెతో పాటు కేంద్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి ఉమా భారతి సైతం ఇబ్బందికర స్టేట్మెంట్ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పురందేశ్వరి అసలు ప్రాజెక్టే సందేహాస్పదమని తేల్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును అనుమానిస్తూ....ప్రాజెక్ట్ పై అనేక సందేహాలున్నాయని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ అనుమాలన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాతే కేంద్రం స్పందిస్తుందని తేల్చిచెప్పారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గురించి స్పందిస్తూ... ఆ అథారిటీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని అన్నారు.

ఇదిలాఉండగా...ఢిల్లీలో కేంద్రమంత్రి ఉమాభారతి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచేదిలేదని చెప్పారు. పోలవరానికి రూ.1600 కోట్లు ఇవ్వాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని...అనుకున్న గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢిల్లీకి ఆహ్వానించానమని ఆమె తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు