కేసీఆర్ లెక్క 1.3 లక్షల కోట్లు?

కేసీఆర్ లెక్క 1.3 లక్షల కోట్లు?

కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకున్న ఆశలు ఆవిరవడంతో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బడ్జెట్ పరిమాణాన్ని ఖరారు చేసుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షల నుంచి 1.3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండబోతోందని సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కేసీఆర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారు జిఆర్ రెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి బిపి ఆచార్య, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులతో ఆయన సమావేశమయ్యారు.

కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతలు, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై పడనున్న ప్రభావం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్న ఇతర గ్రాంట్లు తదితర అంశాలపై సిఎం చర్చించారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం రాష్ట్రానికి రానున్న నిధులపై ఒక అవగాహన ఏర్పడటంతో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం స్పష్టమైన అంచనాకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1.25 లక్షల నుంచి 1.3లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఖరారు చేయాలని సిఎం కెసిఆర్ సూచనప్రాయంగా అధికారులకు వెల్లడించినట్టు అధికారవర్గాల సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితులకు ఉచిత భూపంపిణీ, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులో సింహభాగం ఉండాలని అధికారులకు సిఎం మార్గనిర్దేశం చేసినట్టు సమాచారం. మొత్తం లక్షా 30 వేల కోట్లతో తయారుచేయాలని సూచించారని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు