జ‌గ‌న్‌ సొంత జిల్లాలోనే స్కెచ్ వేశారు

జ‌గ‌న్‌ సొంత జిల్లాలోనే స్కెచ్ వేశారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాజ‌కీయంగా ఇరుకున పెట్టాల‌నే దిశ‌గా సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఎత్తులు మ‌రింత ప‌దునుగా మారుతున్నాయి. అభివృద్ధి నినాదంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు వేగం పెంచిన టీడీపీ మ‌రో కీలక ల‌క్ష్యంపై దృష్టిసారించింది. వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఆయ‌న్ను దెబ్బ‌కొట్టేలా సిద్ధ‌మ‌వుతోంది. ఇందులో భాగంగా రాజ్యసభ మాజీ సభ్యుడు, పార్టీ సీనియ‌ర్ నేత మైసురారెడ్డిని తిరిగి సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారభించినట్లు సమాచారం.

తెలుగుదేశం ద్వారా వ‌చ్చిన రాజ్యసభ పదవీకాలం ముగిసిన వెంటనే మైసురారెడ్డి తన కుమారుడి ఒత్తిళ్లకు తాళలేక వైసీపీలో చేరారు. ఆ తర్వాత కొంతకాలం వైసీపీలో క్రియాశీల పాత్ర పోషించినప్పటికీ, జగన్‌తో పొస‌గ‌క పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్ ఆయనను దూరం పెట్టారన్న చర్చ కూడా జ‌రిగింది. ఈ క్ర‌మంలో కొద్దికాలం క్రితం రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీ లేదా వేదిక ప్రారంభించాలని ప్రయత్నించారు.  వివిధ పార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరిపినప్పటికీ అది ప్రాథ‌మిక ద‌శ‌లోనే నిలిచిపోయాయి.

వైఎస్ జ‌గ‌న్ కుటుంబంతో వ్య‌క్తిగ‌తంగా ఉన్న దూరంతో పాటు సీనియ‌ర్ నాయ‌కుడ‌నే పేరు, వ్యూహరచయిత, పార్లమెంటు చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన ఉన్న మైసురారెడ్డి తిరిగి తన పార్టీలోకి వస్తే, కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, మైసురా రెడ్డి పార్టీలో చేరితే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రఘురామిరెడ్డితో పాటు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాజకీయంగా మైసురా సలహాలు పాటించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప‌లో పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత స‌హా ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించ‌గ‌లిగితే జ‌గ‌న్‌ను మాన‌సికంగా దెబ్బ‌కొట్టిన‌ట్లేన‌ని తెలుగుదేశం వ‌ర్గాలు భావిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు