గవర్నర్‌కే రూల్స్‌ చెప్పిన జగన్‌

గవర్నర్‌కే రూల్స్‌ చెప్పిన జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత,  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏపీలో పరిణామాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన గురించి ఫిర్యాదు చేసేందుకు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగు ప్రధాన అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టుకొని గవర్నర్‌ను కలిసిన జగన్‌ పనిలో పనిగా గవర్నర్‌ నరసింహన్‌కు ఆయన బాధ్యతలు గుర్తుచేశారు.

పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో గవర్నర్‌ను కలిసిన తర్వాత జగన్‌ విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చంద్రబాబు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని జగన్‌ ఆరోపించారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యంగా సీమకు అన్యాయం చేసే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు విషయంలో బాబు చూసీ చూడనట్లు ఉంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్‌ కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ట్రైబల్‌ ఎడ్వైజరీ కమిటీ నియామకం చేసేలా చూడాలని గవర్నర్‌కు జగన్‌ విన్నవించారు. ప్రతిపక్ష సభ్యులైన తమ ఎమ్మెల్యేలకు స్థానం దక్కుతుందనే కారణంతోనే చంద్రబాబు ఈ విషయాన్ని నాన్చుతున్నారని జగన్‌ ఆరోపించారు.

ఈ సందర్భంగా తమ పార్టీ నాయకులపై ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు కేసుల పెడుతున్నారని గవర్నర్‌ దృష్టికి జగన్‌ తీసుకెళ్లారు. దీంతోపాటు తునిలో జరిగిన కాపుల రిజర్వేషన్‌ సభ సందర్భంగా రైలు దగ్దం విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు జగన్‌ సూచనలు చేశారు. ''బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా అన్ని చేసేశాం అని గవర్నర్‌ ప్రసంగంలో మీతో చెప్పిస్తున్నారు. అందుకే  రుణమాఫీ చేశామని అబద్దాలు చెప్పించేటపుడు మీరు సమగ్ర సమాచారం తెప్పించుకుని, పరిశీలించండి'' అని గవర్నర్‌కు జగన్‌ సూచించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు