రిలయన్స్‌ జియో 4జీ.. చాలా స్లో గురూ..

రిలయన్స్‌ జియో 4జీ.. చాలా స్లో గురూ..

ఇండియాలో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న రిలయన్స్‌ 4జీ సేవలు అనుకున్నంత ప్రయోజనకరంగా లేవని తేలింది. రిలయన్స్‌ జియో సేవలను సాధారణ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి తేనప్పటికీ ఆ సంస్థకు చెందిన లక్ష మంది ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా పరిశీలనకోసం అందుబాటులోకి తెచ్చారు. మొన్నటి డిసెంబరు నుంచి రిలయన్స్‌ జియో 4జీ సర్వీసులను వారు టెస్ట్‌ చేస్తున్నారు. అయితే... అనుకున్నంత వేగం లేదని... డాటా స్పీడు తక్కువగానే ఉందని ఈ టెస్టింగ్‌ లో తేలింది. కనెక్టివిటీ పరంగానూ నాట్‌ బేడ్‌ అనిపించుకుంది కానీ సూపర్‌ అని మాత్రం అనిపించుకోలేకపోయింది రిలయన్స్‌ జియో.

ప్రస్తుతం రిలయన్స్‌ జియో సగటున 17.34 ఎంబీపీఎస్‌ డౌన్లోడింగ్‌ స్పీడ్‌ అందుతుండగా అప్‌ లోడింగ్‌ స్పీడ్‌ మాత్రం దారుణంగా నిరాశపరుస్తోంది. కేవలం 3.34 ఎంబీపీఎస్‌ సగటు అప్‌ లోడింగ్‌ స్పీడ్‌ మాత్రమే నమోదైంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తున్న రిలయన్స్‌ ఇదే డాటా స్పీడుతో వస్తే మాత్రం వినియోగదారులను నిరాశపరిచినట్లే.

జియో ఓపెన్‌ సిగ్నల్‌ యాప్‌ సహాయంతో సంస్థకు చెందినవారు దీని పనితీరును పరీక్షిస్తున్నారు. 2500 టెస్ట్‌ ప్రయత్నంలో జియో డివైస్‌ లు 93 శాతం కనెక్టివిటీని నమోదు చేయడంతో సిగ్నళ్ల సమస్య పెద్దగా లేనట్లు తేలింది. అయితే... డాటా వేగం పెంచడంపై మాత్రం దృష్టిసారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే పేరుగా 4జీ కానీ 3జీ కంటే ఘోరం అనిపించుకోవాల్సి ఉంటుంది రిలయన్స్‌ జియో.

కాగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రిలయన్స్‌ జియో ఎల్‌ టీఈ సిగ్నళ్లు అందుతున్నాయి. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌ కతా, కోచి, హైదరాబాద్‌, విశాఖపట్నం, అహ్మదాబాద్‌, లక్నో, ఇండోర్‌, చండీగఢ్‌, జైపూర్‌ తదితర నగరాలతో పాటు పలు చిన్న పట్టణాల్లోనూ జియో ఎల్టీఈ సిగ్నళ్లు అందుతున్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు