జగన్‌ కు సమన్లు ఇప్పుడెందుకు..?

జగన్‌ కు సమన్లు ఇప్పుడెందుకు..?

అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై పలు కేసులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా  అక్రమాస్తులకు సంబంధించి జగన్‌ తో పాటు.. 19 మందిపై ఈడీ చేసిన ఫిర్యాదుపై ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు తీసుకోవటంతో పాటు.. మార్చి 28న నిందితులుగా పేర్కొంటున్న వారు కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సమన్లు పంపిన నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొన్నారు.

ఇంతకీ ఈ కేసేమిటి..?

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన సెజ్‌లో అరబిందో గ్రూపు.. హెటిరో గ్రూపులకు 75 ఎకరాల చొప్పున భూకేటాయింపు జరిగింది. దీన్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది ఆరోపణ. నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు.. ఇలా లబ్థి పొందిన వారు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా ఆరోపిస్తున్నారు.

రూల్స్‌ ని ఎలా బ్రేక్‌ చేశారు?

కంపెనీలకు కేటాయించిన భూమి విలువ రూ.15 లక్షలు ఉంటే.. కేవలం రూ.7లక్షలకే భూమిని కేటాయించారన్నది ప్రధాన ఆరోపణ. తక్కువ ధరకు భూకేటాయింపుల్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చెప్పిన మేరకు నాటి ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తక్కువ ధరకు భూములు కేటాయించారు.

ఎలా లబ్థి పొందారు?

అరబిందో గ్రూపుతో ఎలాంటి రిలేషన్‌ లేకున్నా ఆ కంపెనీకి అనుబంధం అంటూ పాశమైలారంలో ఆ కంపెనీకి కేటాయించిన 30 ఎకరాలను ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కు బదిలీ చేశారు. ఇదంతా రూల్స్‌ కి భిన్నంగా  చోటు చేసుకుంది.

వీళ్లకు.. జగన్‌ కు లింకేంటి?

భూకేటాయింపులు తదితరాలతో  తమకు చేకూరిన లబ్థికి ప్రతిఫలంగా జగన్‌ కు చెందిన జగతి పబ్లికేషన్స్‌.. జనని ఇన్‌ ఫ్రాల్లో రూ.29.5కోట్లు పెట్టుబడులుగా పెట్టటం.

ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు?


తమకు చేకూరిన లబ్థికి ప్రతిఫలంగా ముడుపుల్ని జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలోకి మళ్లించారన్నది ఆరోపణ. జగతిలో అరబిందో గ్రూపునకు చెందిన నిత్యానంద రెడ్డి భార్య.. సోదరులు రూ.3కోట్లు.
జగతిలో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.7 కోట్లు
జనని ఇన్‌ ఫ్రాలో హెటిరో గ్రూపు రూ.15కోట్లు.. జగతిలో రూ.4.5కోట్లు

తాజా సమన్లు జారీ అయిన నిందితులు ఎవరంటే..

వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి
వి.విజయసాయిరెడ్డి
ఎం.శ్రీనివాసరెడ్డి (హెటిరో డైరెక్టర్‌)
హెటిరో డ్రగ్స్‌, హెటిరో ల్యాబ్స్‌, హెటిరో హెల్త్‌ కేర్‌, కె.నిత్యానందరెడ్డి (అరబిందో ఎండీ)
అరబిందో ఫార్మ, ఏపీఎల్‌ హెల్త్‌ కేర్‌, పి.శరత్‌శ్చంద్రారెడ్డి (ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ మాజీ ఎండీ)
ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ (ప్రస్తుత యాక్సిస్‌ క్లినికల్స్‌), పి.వి.రాంప్రసాద్‌రెడ్డి
కె.ప్రసాద్‌రెడ్డి (నిత్యానందరెడ్డి సోదరుడు)
కె.రాజేశ్వరి (నిత్యానందరెడ్డి భార్య)
పి.ఎస్‌.చంద్రమౌళి (అరబిందో ఫార్మ కంపెనీ మాజీ కార్యదర్శి)
ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్య (ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌, ఎండీ)
వై.వి.ఎల్‌.ప్రసాద్‌ (ఏపీఐఐసీ రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌) తదితరులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు