తెలంగాణ పోలీసులు నిజంగా గ్రేట్‌ అబ్బా

తెలంగాణ పోలీసులు నిజంగా గ్రేట్‌ అబ్బా

తెలంగాణ పోలీసులు కేంద్రం మనసు గెలుచుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు ఏకంగా కేంద్ర హోంమంత్రి లైన్లోకి వచ్చి అభినందించే స్థాయిలో తెలంగాణ రక్షకబటుటు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా జరిగిన ఈ సంఘటన తెలంగాణ పోలీసుల సత్తా చాటుతోందని చెప్పవచ్చు.

2013లో కాండ్వా జైలు నుంచి ఆరుగురు ఉగ్రవాదులు తప్పించుకోగా, గత ఏడాది ఇద్దరు ఉగ్రవాదులు ఎజాజ్‌, అస్లామ్‌లను నల్గొండలో హతమార్చారు. మిగిలిన నలుగురు సిమీ ఉగ్రవాదుల ఒడిశాలోని రావూర్‌ఖిలా కురేచిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఇంటిపై ఒడిశా, తెలంగాణ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. మూడు గంటల పాటు ఉగ్రవాదులు-పోలీసుల మధ్య సాగిన కాల్పుల అనంతరం వారిని అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ మోస్ట్‌వాంటెడ్‌ లిస్టులో ఉన్న నలుగురు ఉగ్రవాదులైన జాకీర్‌, అంజాద్‌, మహబూబ్‌, సాలిక్‌లను తాజాగా అరెస్టు అయిన వారిలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ఐదు పిస్టోళ్లు, బుల్లెట్లు, ఇతర పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరు తప్పించుకున్న సమయంలో ఒక్కొక్కరిపై రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించినట్లు ఒడిశా డీజీపీ కేబీసింగ్‌ తెలిపారు.

ఈ ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోలీసులను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభినందించారు. తెలంగాణ డీజీపీకి ప్రత్యేకంగా ఫోన్‌ చేసి మరీ రాజ్‌నాథ్‌ సింగ్‌ వీరి ధైర్యాన్ని కొనియాడారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో తెలంగాణ  పోలీసులు కీలకంగా వ్యవహరించారని రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంతోనే పోలీసు శాఖకు గుర్తింపు వస్తుందని ఆయన కితాబిచ్చారు. చూస్తుంటే...తెలంగాణ పోలీసులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు