కేసీఆర్‌ పుట్టినరోజుకు ఏపీలో సంబరాలు

కేసీఆర్‌ పుట్టినరోజుకు ఏపీలో సంబరాలు

తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆదరాభిమానాలు సంపాదించుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఏపీలోనూ ప్రజలను అట్రాక్ట్‌ చేస్తున్నారు. అదేం విచిత్రమో కానీ ఉద్యమ సమయంలో సీమాంధ్రులను శత్రువుల్లా చూసిన ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత వారిని పల్లెత్తు మాటనడం లేదు. సీమాంధ్రులు కూడా విభజన సమయంలో కేసీఆర్‌ ను తీవ్రంగా వ్యతిరేకించినా ఇప్పుడు మాత్రం ఆయన పట్ల తెగ క్రేజ్‌ చూపిస్తున్నారు.

కేసీఆర్‌ పై ఏపీ ప్రజల అభిమానం ఏ రేంజిలో ఉందో అమరావతి శంకుస్థాపన సందర్భంగా తొలిసారి తెలిసింది. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్‌ అయిదు నిమిషాలు మాట్లాడగా ఏపీ ప్రజలు విజిళ్లు చప్పట్లతో మార్మోగించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, మోడీ ప్రసంగాలకు కూడా అలాంటి స్పందన రాలేదు. దీంతో రాజకీయ నేతలే కాకుండా ఏపీ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత కూడా చండీయాగం కోసం చంద్రబాబును పిలవడానికి కేసీఆర్‌ విజయవాడ వస్తే, ఆయనకు బహుమతులు, జాపికలు ఇవ్వడానికి ఒకరిద్దరు వచ్చారు. తాజాగా కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏపీలో కేకులు కోయడం, సేవాకార్యక్రమాలు చేపట్టడం విశేషం.

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకల్ని తూర్పుగోదావరిలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్ళి స్థిరపడ్డ వారు తెలంగాణాస్టేట్‌ సీమాంధ్ర యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జాల్లాలోనిపలు ప్రాంతాలలో కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, మండపేట తదితర ప్రాంతాల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అనాధాశ్రమాల్లో వృద్దులకు దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాలల్లో పిల్లలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళు పంచారు. ఈ ఫ్రంట్‌ కన్వీనర్‌ సింగినీడి సీతారామ్‌ అమలాపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. లూయీ అంధుల హాస్టల్‌లో కేక్‌ కట్‌ చేసి అంధ బాలలకు పళ్ళు పంచారు. మరోవైపు అనంతపురానికి చెందిన ఓ అభిమాని కేసీఆర్‌ చిత్రంతో పట్టువస్త్రం నేసి దాన్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఇలా కేసీఆర్‌ అంటే సీమాంధ్ర ప్రజలు అభిమానం పెంచుకుంటున్నారు. ఇదే కొనసాగితే కేటీఆర్‌ సరదాగా అన్నట్లుగా ఏపీలోనూ టీఆరెస్‌ పోటీ చేస్తుందేమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు