ఈ పెద్దోళ్లు చాలా ఎగ్గొట్టేసారు

ఈ పెద్దోళ్లు చాలా ఎగ్గొట్టేసారు

ఏదైనా బ్యాంకు వద్ద రూ.లక్ష అప్పు తీసుకొని.. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా వరుసగా మూడు నెలలు పాటు వాయిదాలు కట్టకపోతే నానా యాగీ చేయటమేకాదు.. నీకేం కష్టమన్నది మాకు అనవసరం.. మాకైతే.. మా అప్పు కట్టాల్సిందేనని ముక్కుపిండి వసూలు చేయటం బ్యాంకులకు అలవాటే. సామాన్యుల విషయంలో ఈ రచ్చతో పాటు.. సిబిల్‌ రేటింగ్‌ విషయంలో కోత పెట్టి.. భవిష్యత్తులో అప్పులు ఇచ్చే విషయంలో క్రెడిట్‌ రేటింగ్‌ ను తగ్గించేసేలా చర్యలు తీసుకుంటాయి. సామాన్యలు పట్ల ఇంత కటువుగా వ్యవహరించే బ్యాంకులు.. పెద్దల విషయంలో ఎలా ఉంటాయన్న విషయాన్ని చూస్తే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ కావటం ఖాయం.

ఎందుకంటే 2013 నుంచి 2015 మధ్య కాలంలో అంటే.. మూడు ఆర్థిక సంవత్సరాల్లో 29 ప్రభుత్వ బ్యాంకులు మొత్తంగా రద్దు చేసిన మొండి బాకీల విలువ ఎంత తెలుసా? అక్షరాల రూ.1.14లక్షల కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని సింఫుల్‌ గా తమకున్న విచక్షణాధికారంతో రద్దు చేసిన బ్యాంకులు.. అలా రద్దు చేసిన పెద్ద మనుషుల వివరాలు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అనటం గమనారం.

లక్షల కోట్ల రూపాయిల ప్రయోజం పొందిన వాళ్ల వివరాలు ఇచ్చేందుకు నో అనటం.. తాజాగా 2015 ఒక్క సంవత్సరంలోనే రూ.40వేల కోట్ల మొండి బాకీల్ని రద్దు చేసేయటంపై కడుపు మండిన న్యాయవాది ప్రశాంత్‌ భూషన్‌ తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. రూ.500కోట్లకు పైబడి అప్పులు చెల్లించాల్సిన కంపెనీల జాబితాను తమకు ఆరు వారాల వ్యవధిలో సీల్డ్‌ కవర్‌ లో ఇవ్వాలంటూ రిజర్వ్‌ బ్యాంకు ఇండియాను ఆదేశించటం తోపాటు.. మొండి బాకీల విషయంలో విధివిధానాలు.. వసూళ్ల యంత్రాంగంపై పలు ప్రశ్నలు సంధించింది. సుప్రీం ధర్మాగ్రహం నేపథ్యంలో అయినా.. వేలాది కోట్ల రూపాయిల్ని ఎగగొట్టిన పెద్దమనుషుల పేర్లు బయటకు వస్తాయా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు