మోడీ బ్యాచ్‌ ఊపు తగ్గలేదు బాస్‌

మోడీ బ్యాచ్‌ ఊపు తగ్గలేదు బాస్‌

సార్వత్రిక ఎన్నికల్లో తన తఢాఖా ప్రదర్శించిన మోడీ.. ఆ తర్వాత అంతగా తన సత్తాను ప్రదర్శించలేకపోయారన్న విమర్శ బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించినంత విజయాన్ని సాధించకపోవటమే దీనికి నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి విజయాల కంటే ఓటములే కాస్త ఎక్కువగా పడిన పరిస్థితి. ఇక.. ఢిల్లీ.. బీహార్‌ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే వైరి పక్షంలో చెలరేగిపోయిన తీరుతో.. మోడీని వ్యతిరేకించే బ్యాచ్‌ భారీగానే ప్రచారం చేసింది.

దాన్ని తిప్పికొట్టే విషయంలో మోడీ బ్యాచ్‌ సమర్థవంతంగా పని చేయని పరిస్థితి. ఇదిలా ఉండగా.. తాజాగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మోడీ బ్యాచ్‌ (ఎన్డీయే) తన సత్తా చాటాయనే చెప్పాలి. తాము అధికారంలో లేని చోట ఈ ఉప ఎన్నికల్లో విజయాల్ని సాధించటం మరో అంశంగా చెప్పాలి.

మొత్తం 12 స్థానాల్లో ఎన్డీయే పక్షం 7 స్థానాల్లో విజయం సాధించటం ఒక విశేషమైతే.. ఉప ఎన్నికలు జరిగిన 8 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్డీయే విపక్షంగా ఉన్న పరిస్థితి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొత్తం 8 రాష్ట్రాల్లో జరిగిన 12 అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీలు ఏడు స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఏన్డీయే కూటమి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌.. మహారాష్ట్ర.. పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు.. తాము పవర్‌ లో లేని ఉత్తరప్రదేశ్‌.. బీహార్‌.. కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి తన సత్తా చాటటం గమనార్హం.


ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో.. విపక్షాలు బీజేపీ.. కాంగ్రెస్‌ లు ఒక్కొక్క స్థానంలో విజయం సాధించగా.. అధికార ఎస్పీ సైతం ఒక స్థానంలో గెలిచింది. ఇక.. బీహార్‌ లో జరిగిన ఒక స్థానంలో ఎన్డీయే కూటమిలోని ఆర్‌ఎల్‌ ఎస్పీ విజయం సాధించింది. ఒక మధ్యప్రదేశ్‌ లో జరిగిన ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించగా.. పంజాబ్‌ లో జరిగిన మరో ఉప ఎన్నికల్లో ఏన్డీయే భాగస్వామ్య పక్షం గెలిచింది.

ఇక.. తాము అధికారంలో లేని కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 3 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తే.. ఒక స్థానాన్ని అధికార కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఒక.. మహారాష్ట్రలో జరిగిన ఒక ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి చెందిన శివసేన విజయం సాధిస్తే.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక.. త్రిపురలో జరిగిన మరో ఎన్నికల్లో అధికార సీపీఎం విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే.. తాజా ఉప ఎన్నికల ఫలితాల్లో మోడీ బ్యాచ్‌ తమ సత్తాను చాటాయనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు