కాంగ్రెస్‌ జోస్యం: అక్కడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది

కాంగ్రెస్‌ జోస్యం: అక్కడా టీఆర్‌ఎస్‌ గెలుస్తుంది

తాము అధికారంలో ఉంటే చేసేవన్నీ గొప్ప పనులు...అవే పనులు ఇతరులు పాలనా పగ్గాలు చేపట్టిన సమయంలో చేస్తే తప్పుడు పనులు అనే భావన రాజకీయ నాయకుల్లో ప్రగాఢంగా నాటుకుపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఏకపార్టీ పాలన అన్నట్లుగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ హవా నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీలు కకావికలం అయిపోతున్నాయి. అయితే ఈ క్రమంలో ధైర్యంగా ఉండాల్సిన పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌ రాబోయే ఎన్నికల్లో కూడా గెలుస్తుందని చెప్పేయడం ఆసక్తికరం.

సౌమ్యుడిగా పేరొందిన మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టీఆర్‌ఎస్‌ తీరుపై తాజాగా మండిపడ్డారు. ఇతర పార్టీ నాయకులను టీఆర్‌ఎస్‌లోకి లాక్కో వడంపైనే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శ్రద్ధ పెట్టారని ఆయన విమర్శించారు. వరుస ఎన్నికలు నిర్వహించి విజయం సాధించడం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్‌ ఉప ఎన్నిక మొదలుకొని గ్రేటర్‌ హైదరాబాద్‌, నారాయణ ఖేడ్‌ లలో గెలుపుతోపాటు త్వరలో జరగబోయే వరంగల్‌, ఖమ్మం కార్పో రేషన్‌ల ఎన్నికల్లోనూ గెలుపుకోసమే సీఎం పర్యటనలు చేపట్టారని, చేపడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందడానికే సీఎం కేసీఆర్‌ ముందస్తు పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ ముందస్తు పర్యటనల గురించి శ్రీధర్‌బాబు కామెంట్లు టైమింగ్‌ను బట్టి ఉన్నట్లుగా ఎంత కనిపిస్తున్నాయో... త్వరలో జరగబోయే రెండు కార్పొరేషన్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం లేదని తేల్చేసినట్లు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీనియర్‌ నాయకులుగా, మంత్రులుగా పనిచేసిన వారు తమ కామెంట్ల విషయంలో ఒకింత ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు