బెజవాడలో లగడపాటి ఫ్లెక్సీల కలకలం

బెజవాడలో లగడపాటి ఫ్లెక్సీల కలకలం

ఏపీ కానీ రెండు ముక్కలు అయితే.. నేను రాజకీయం నుంచి నిష్క్రమిస్తా..  రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏపీ కాంగ్రెస్‌ నేత లగడపాటి రాజగోపాల్‌ తను చెప్పినట్లే.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెప్పటం తెలిసేందే. విభజన ఎపిసోడ్‌ లో చాలామంది చాలానే మాటలు చెప్పినా.. ఒక్క లగడపాటి మాత్రమే తాను అన్న మాట మీద నిలబడ్డారని చెప్పొచ్చు.

విభజన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా బెజవాడలో ఫ్లెక్సీలు వెలవటం ఒక అనవాయితీగా మారింది. ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తూ ఆయన అభిమానుల పేరిట ఫ్లెక్సీలు వెలుస్తుంటాయి. ఎప్పటిలానే ఈసారి అలానే ఫ్లెక్సీలు వెలిశాయి. కాకుంటే.. లగడపాటికి వెల్‌ కం చెబుతూ ఫ్లెక్సీలు మాత్రమే కాదు.. ఆయన్ను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

గతంలో రాజకీయాలు చేసిన లగడపాటి అక్రమంగా రూ.75వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని.. అది సరిపోక మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తూ పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''రూ.75వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని.. బ్యాంకుల్ని ముంచి.. కుటుంబం పేరు మీద విదేశాల్లో అక్రమ ఆస్తులు కూడ పెట్టుకున్న లగడపాటి రాజగోపాల్‌ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మరెన్నో వేల కోట్ల రూపాయిల్ని కూడబెట్టుకోవాలని ఆకాంక్షిస్తూ.. మీ అభిమానులు'' అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు  కలకలం రేపుతోంది.

తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై లగడపాటి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మొత్తంగా లగడపాటికి అనుకూలంగా.. వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీల పుణ్యమా అని బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న దుస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు