మాట తప్పుతారు.. మడమ తిప్పుతారు

మాట తప్పుతారు.. మడమ తిప్పుతారు

చెప్పే మాటలన్నీ ఉత్త మాటలని తేలిపోయాయి.  చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం జగన్ అని తేలిపోయింది. ఇంకెవరో చెబితే వారిని కాస్త అపనమ్మకంతో చూడొచ్చు.  వైఎస్ ను పిచ్చిగా.. పిచ్చిగా అభిమానించే కొండా ఫ్యామిలీ జగన్ అసలు రూపాన్ని బహిరంగ లేఖ రూపంలో రాష్ట్ర ప్రజలకు చెప్పారు. ఎవరినైనా విమర్శించాలంటే అసలు కంటే కాస్త తక్కువగానే చెబుతారు. ఈ లెక్కన.. కొండా ఫ్యామిలీ చెప్పే మాటల్ని చూసినప్పుడు... బయటకు వారు చెప్పింది కొంతే.. లోపల విషయం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కేవలం వైఎస్ కుటుంబం కోసం మొట్టమొదటగా మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండా సురేఖ కమిట్ మెంట్ ను శంకించలేం.

జగన్ వెంట ఉండాలని ఒక డెసీషన్ కి వచ్చాక.. ఎంత దూరమైనా ముందుకే.. వెనక్కి తగ్గేది లేదంటూ సురేఖ భర్త కొండా మురళీ సైతం తన ఎమ్మెల్సీ పదవిని లెఫ్ట్ లెగ్ తో తన్నేసాడు. అన్నింటికి మించి చెప్పాల్సింది. ఓదార్పుయాత్ర కోసం జగన్ వరంగల్ జిల్లాకు వెళ్లినప్పడు.. తెలంగాణ వాదం తీవ్రంగా ఉండి.. అందరూ ఏకమై దాడి చేసినా.. వాదాన్ని వదిలి... నమ్మిన ఫ్యామిలీ కోసం మేం ఉన్నామంటూ సొంత జనాల మీద కాల్పులకు తెగబడిన కొండా ఫ్యామిలీకి మించి వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు ఉండకపోవచ్చు. ఎప్పుడో వచ్చి పడే అధికారం కోసం చుట్టూ ప్రతికూల పరిస్థితుల్ని కొని తెచ్చుకోవటం..  భావోద్వేగాలనే సుడిగాలికి ఎదురొడ్డి పోరాడటమనేవి చిన్న విషయాలు కావు. అలాంటివాటినెన్నో జగన్ కోసం నష్టపోయిన కొండా ఫ్యామిలీ జగన్ అసలు రంగు బయటపెట్టటం సంచలనం సృష్టిస్తోంది.

జగన్ ప్రత్యర్థులు నిత్యం విమర్శించేటట్లు.. లక్ష కోట్లు కాదు.. లక్షల కోట్ల రూపాయిల సంపాదన కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలు సరైనవి కావంటూ సురేఖ అక్క రాసిన లెటర్ జగన్ లోపలి మనిషి గురించి చెప్పకనే చెబుతుంది. ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగిస్తానని చెప్పుకునే జగన్ మాటల్ని ఇక ఇప్పుడు...‘‘రాజకీయ లాభం, అధికారం వస్తుందంటే ఎంతకైనా తెగిస్తా’’ అనుకోవాల్సిందే. తండ్రి మరణం తర్వాత.. ఆయన్ని అభిమానించే వారు ఆత్మహత్యలు చేసుకోవటంతో ఆ కుటుంబాల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర మొదలుపెట్టాననే జగన్ మాటల వెనుక మర్మం.. తనను ముఖ్యమంత్రిని చేయలేదన్న అక్కసు తప్పితే.. తన తండ్రి కోసం చనిపోయిన వారిని ఓదార్చటం కాదని తేటతెల్లమైనట్లే. నమ్మిన వాళ్లకు అవసరానికి మించి చేయటం వైఎస్ కు అలవాటు. కానీ.. జగన్ లో అలాంటిదేమీ లేదని కొండా సురేఖ మాటల్లో అర్థమవుతుంది. ‘‘మన పార్టీ తరఫున ఒక ఎమ్మెల్సీ స్థానానికి భర్తీ చేసే అవకాశం రాగా అది నా భర్తకు తెలంగాణ నుంచి ఇవ్వమని అడిగాను. కానీ మీరు ఆ పదవిని మాకు ఇవ్వకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన... అప్పుడే పార్టీ మారిన వ్యక్తికి ఇచ్చారు. అయినా మేం బాధపడలేదు.

మీతో ఉన్నాక మేం రాజకీయంగా,ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. మేమే కాకుండా మమ్మల్ని నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా నష్టపోయారు. కానీ.. తెలంగాణ మీద మీరు అనుసరిస్తున్న వైఖరి మా ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని, మనో భావాల్ని దెబ్బ తీసింది. లోటస్ పాండ్ లోని మన పార్టీ ఆఫీసులో గతంలో మన పార్టీ మీటింగ్ లో నన్ను స్టేజీపై విజయమ్మ పక్కన కూర్చోబెట్టి తర్వాత కొన్నాళ్లకు కింద కూర్చోబెట్టారు. అయినా ఇది పద్దతా అని ఏనాడు> అనుకోలేదు’’ అంటూ వాపోయారు. పార్టీ అసలు రంగు గురించి చెబుతూ.. ‘‘మీరు జైలుకు వెళ్లిన తర్వాత మన పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ప్రజాబలం లేని కొందరు నాయకులు బ్రోకర్ల అవతారం ఎత్తి డబ్బులు తీసుకొని ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోవటానికి బేరం పెడుతున్నారు. అలాంటి వారిని మీరు నమ్మి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

గతంలో వైఎస్సార్ వెంట ఉన్న వారిని పక్కనపెట్టి... ప్రజల్లో బలం లేని వారిని.. కోవర్టులకు పార్టీలో పెత్తనాన్ని ఇస్తున్నారు’’ అంటూ ఓ రేంజ్ లో ఏకిపారేసిన కొండ సురేఖ మాటల్ని చూస్తే... జగన్ బాబు చిన్నెలు చిన్నవేం కాదని చెప్పొచ్చు. భావోద్వేగ రాజకీయాలన్ని నడిపించటంలో జగన్ కు ఉన్న తెలివితేటలు రాష్ట్రంలో మరెవరికీ లేవేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు