జగన్ – రాజకీయాలకు పనికిరాడా?

జగన్ – రాజకీయాలకు పనికిరాడా?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన రెడ్డి తప్పిదాలపై తప్పాదాలు చేస్తూ, అపజయాలు, అప్రతిష్టల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇది కేవలం అతగాడి రాజకీయ అపరిపక్వతను సూచిస్తోంది తప్ప మరేమీ కాదు. రాజకీయ పార్టీ స్థాపించడం పెద్ద కష్టం కాదు. డబ్బులుంటే నిర్వహించడం అంతకన్నా కష్టం కాదు. కానీ, నిలబెట్టుకోవడం, విజయపథం దిశగా నడిపించడం చాలా కష్టం. దానికి నిర్వహణా సామర్థ్యం చాలా కావాలి.  నిర్వహణాసామర్థ్యం అంటే ఇక్కడ మేనేజ్మెంట్ కాదు. సంస్థలు నిర్వహించడానికి మేనేజ్మెంట్ కావాలి. ఆ మేనేజ్మెంట్ రాజకీయపార్టీలకు సరిపోదు. అక్కడ ఉద్యోగులు వుంటారు. సంస్థతో అవసరం వున్నన్నాళ్లు బాస్  ఎలా ప్రవర్తించినా అక్కడే వుంటారు. చాన్స్ దొరకగానే జంప్ అవుతారు. అలా అని బాస్ కు వచ్చిన నష్టంలేదు. కొత్త ఎంప్లాయిని వెదికి మరీ తెచ్చుకుంటారు. కానీ రాజకీయాపార్టీలకు నాయకుల అవసరం, సరైన నాయకుల కొరత చాలా వుంటుంది. అలాంటి వారిని ఎరవేసి మరీ పట్టుకోవాలి. అదే విధంగా వున్నావళ్లను వీలయినంత బుజ్జగించి మరీ చూసుకోవాలి. అదే సమయంలో భయభక్తలు పోకూడదు. ఇలా అన్ని రకాల విద్యలు ప్రదర్శిస్తే తప్ప పలితం కనిపించదు.

సాధారణంగా సినిమా రంగం వచ్చినవారికి, అయాచితంగా శాసించే అవకాశం వచ్చినవారికి ఒంటెద్దు పోకడలు వుంటాయి.  వారికి తాము పట్టందే కుందేలు..దానికి మూడేకాళ్లు అన్నవ్యవహారం వుంటంది. దీంతో పాటు యజమాని మనసెరిగి ప్రవర్తించడం తప్ప, ఇది సరికాదు అని చెప్పేవారి సంఖ్యం వీలయినంత తక్కువ వుంటుంది. చెప్పాలని వున్నా, అటు వినే ఓపిక వుండదని తెలిసిన మీదట భజనపరులుగా మారిపోతారు తప్ప, సరియైన సలహాలు ఇవ్వాలనుకోరు. ఇలాంటి వారు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు అయితే హిట్ లేదా ఫట్ అన్నదే సాధారణంగా వుంటుంది. ఎందుకంటే స్వంత తెలివితేటలు, సరియైన ఆలోచన, సామర్థ్యం వుంటే హిట్...అవి లేకుంటే ఫట్. మల్టీనేషనల్ కంపెనీల్లొ కనిపించే టీమ్ వర్క్ ఇక్కడ కనిపించదు కాబట్టి. అదే విధంగా అధికారం చెలాయించడానికే మొదట్నించీ అలవాటు పడ్డవారు, శాసించడం తప్ప, చేరదీయడం తెలియని వారు కూడా రాజకీయాల్లో రాణించలేరు. చిరంజీవి నటుడిగా అంత పేరు తెచ్చుకుని, పార్టీ పెట్టి విఫలం కావడానికి ఇవే కారణాలు. జగన్ పరిస్థితి కూడా ఇదే. నరనరానా ‘నా ఇష్టం..నాకు తెలుసు..మీరు చెప్పకర్లేదన్న’భావన.

రాజకీయాల్లో మాజీ శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు కొణతాల రామకృష్ణ అంతటి సౌమ్యలు, తల వంచుకు పోయే వ్యవహారం కలిగినవారు చాలా తక్కువ మంది వుంటారు. కొండా సురేఖ ఇందుకు పూర్తిగా భిన్నం. ఊ...అంటే ఒంటి కాలిపై లేచే, లేవగలిగే వ్యవహారం. ఈ ఇద్దరూ కూడా జగన్ పార్టీతో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి ఇప్పుడు రాష్ట్రం చూసింది. దినికి కారణం ఏమిటి అన్నది జగన్ ఆలోచించుకోవాలి. నటుడు రాజశేఖర్ కు జగన్ తో ఓ చేదు అనుభవం వుంది. పార్టీ పబ్లిక్ మీటింగ్ లకు ఇలా మాంచి గెటప్, దుస్తులు వేసుకుని రావద్దు’ అని జగన్ చెప్పడం ఆ చేదు అనుభవం. తెలివైన రాజకీయనాయకుడు ఇలా చెప్పడు. పార్టీ సమావేశాలకు ఇలా రండి అని, అందరికీ ఓ యూనిఫారమ్ నిర్దేశిస్తాడు. అప్పుడు రాజశేఖర్ అఫెండయ్యే అవకాశం వుండదు. కానీ జగన్ అలా ఆలోచించడు. తన మాటే తనది. తప్పు చేస్తే నిలదీయడం తప్పు కాదు. కానీ రాజకీయాల్లొ అది కూడా సున్నితంగా సాగించాలి అప్పుడప్పుడు.

తెలంగాణాపై పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. అయితే దీనివల్ల ఎంతటి డామేజి జరుగుతుందో ఊహించకపోవడం తప్పు. అలాంటి నిర్ణయం తీసుకొవడం వల్ల నష్టపోయేవారి గురించి ఆలోచించకపోవడం తప్పు. ఇప్పుడు జగన్ చేసింది అదే. చంద్రబాబు చేయనిది అదే. చంద్రబాబు పార్టీ జన్మతహా సమైక్యవాది అన్నది తెలిసిందే. కానీ ఆ పార్టీ తెలంగాణా వాదులు ఏమీ మాట్లాడకుండా ఎలా కట్టడి చేయగలిగారు..సమైక్యవాదులు కూడా ఎందుకు మాట్లాడడం లేదు. ఇంతటి కట్టుదిట్టమైన స్ట్రాటజీ ఎలా అమలు చేయగలగుతున్నారు, అన్నది జగన్ , చిరంజీవి లాంటి వారు ఆలోచించాలి.

సొనియా గాంధీకి శక్తివంతమైన మహిళ అన్న పేరు ఊరికనే వచ్చిందా..ఆమె పనితీరును ఆది నుంచీ గమనించండి. దాదాపు దేశంలోని మిగిలిన రాజకీయనాయకుల అందరి పనితీరుకు భిన్నంగా వుంటుంది. సోనియా తన అంతట తాను మీడియాతో మాట్లాడి ఎన్నాళ్లయి వుంటుంది? మీడియాతో మాట్లాడకుండా ఓ పార్టీ అధ్యక్షుడు వుండగలడా? వీలవుతుందా? ఎన్ని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పన్నుకుంటూ, రాగలుగుతోంది.

రాజశేఖర రెడ్డి వయసు మీదపడ్డాక కానీ ఈ తరహా లక్షణాలు అలవాటు చేసుకోలేదు. చంద్రబాబుకు మొదట్నించీ అదే  శైలి. ఈ తరహా శైలి అలవాటు లేకనే ఎన్టీఆర్ దెబ్బతిన్నారు. చిరంజీవి నెగ్గుకురాలేదు. దానా దీనా గమనించాల్సింది ఏమిటంటే జగన్ తన వైఖరి మార్చుకోకుంటే, పార్టీలో ఆయన ఒక్కరే మిగిలేది. మార్చుకుంటే కనీసం పార్టీ అయినా మిగులుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు