ఫోన్‌కు 4 గంటలే... బాబుకు 18 గంటల చార్జింగ్‌

ఫోన్‌కు 4 గంటలే... బాబుకు 18 గంటల చార్జింగ్‌

అధినేతలును పొగిడేందుకు నాయకులు తెచ్చే పోలికలు, పొగడ్తలు ఒక్కోసారి భలే ఇబ్బందికరంగా మారుతుంటాయి. అసలే పొగడ్తలు,అది కూడా ప్రతిపక్షాలకు కౌంటర్‌ సందర్భం అంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కితాబిచ్చే విషయంలో ఒకింత అతి చేసిన ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇపుడు అదే తరహా ఇబ్బందికర పరిణామాన్ని సృష్టించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడూతు.. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ గురించి విరుచుకుపడ్డారు. జగన్‌ లాగా అవినీతి చేస్తూ రూ.లక్ష కోట్లు సంపాదించే సామర్ధ్యం తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని చెప్పారు. చంద్రబాబుది 24 గంటలూ పని చేసే చరిత్ర అయితే.. జగన్‌కు నాంపల్లి టు సుప్రీంకోర్టు వరకు తిరిగే చరిత్ర ఉందని విమర్శించారు. రాజధాని నిర్మాణం, రెండంకెల వృద్ధి రేటు సాధించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. చంద్రబాబు పరిపాలన గురించి ప్రపంచం అంతా తెలుసునని,ఇపుడు వైసీపీ నాయకులు కితాబు ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదని చెప్పారు.

తమపై విమర్శలు చేయడంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సోమిరెడ్డి సూచించారు. జగన్‌ ఆపిల్‌ ఫోన్‌, చంద్రబాబు పాత టైప్‌రైటింగ్‌ మెషిన్‌ అనే రోజా విమర్శను ప్రస్తావిస్తూ... ఆపిల్‌ఫోన్‌కు 4 గంటలే చార్జింగ్‌ ఉంటే.. చంద్రబాబుకు 18 గంటల చార్జింగ్‌ ఉంటుందని ధీమాగా చెప్పారు. సోమిరెడ్డి వ్యక్తం చేసిన ధీమాపై ఇపుడు సెటైర్లు పేలుతున్నాయి. చంద్రబాబు సత్తాను చాటడానికి సోమిరెడ్డి  చార్జింగ్‌ పోలిక తేవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదప్రయోగం ఒకింత నెగెటివ్‌ అభిప్రాయాన్ని ప్రస్తవిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా..పాత మోషిన్లకే స్పీడ్‌ తక్కువ, చార్జింగ్‌ ఉండే సమయం ఎక్కువ కదా అంటూ సెటైర్‌ వేస్తున్నారు. సోమిరెడ్డి భుజకీర్తి భౌన్స్‌ అయినట్లు స్పష్టంగా కనిపించడం లేదు!